సిటీబ్యూరో: కాంగ్రెస్ సర్కారు ప్రాజెక్టుల పేరిట నగరవాసులను భయాందోళనలకు గురిచేస్తోంది. భూములు కోల్పోతున్నామని బాధితులు రోడ్డెక్కుతుంటే.. పరిహారం విషయంలో దోబూచులాడుతోంది. ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు కోసం 1500 మంది యజమానులు భూములను కోల్పోతున్నారు. పరిహారం ఇచ్చే అంశాన్ని సర్కారు తేల్చలేదు. తాజాగా భూ బాధితులకు పరిహారం విషయం కొలిక్కి తీసుకువచ్చింది. వీరికి నగదు రూపంలో పరిహారం ఇవ్వడం కంటే టీడీఆర్ రూపంలో చెల్లించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నది.
నిధుల్లేక.. టీడీఆర్..
జేబీఎస్ నుంచి శామీర్‌పేట, ప్యారడైజ్ నుంచి సుచిత్ర మార్గాల్లో 18 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్‌ను హెచ్ఎండీఏ నిర్మిస్తోంది. ఇప్పటికీ పరిహారం, ప్రాజెక్టు వెడల్పులో అభ్యంతరాలతో భూసేకరణ పూర్తి కాలేదు. కానీ సర్కారు మాత్రం భూములు కోల్పోతున్న వారికి పరిహారాన్ని టీడీఆర్ రూపంలో చెల్లించేందుకు సిద్ధమవుతున్నది. కోల్పోతున్న భూమి విలువ రూ. కోటిలోపు, కోటికిపైగా అనే విధంగా విభజన పరిహారం చెల్లించనున్నారు. దీన్ని బాధితులు కోల్పోతున్న మొత్తానికి టీడీఆర్ రూపంలో అందజేయనున్నారు.
ఒక్క ప్రాజెక్టు కూడా..
కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో శంకుస్థాపన చేసిన ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పట్టాలెక్కింది లేదు. దీనికి ప్రధాన కారణం సర్కారు ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడమే. ఈ క్రమంలో ప్రాజెక్టుకు అవసరమైన భూములను తీసుకోవాలంటే బాధితులకు కచ్చితంగా పరిహారం ఇవ్వాల్సిందే. కానీ సర్కారు ఈ విషయాన్ని దాచిపెడుతూ… కేవలం భూములు తీసుకోవాలని విశ్వప్రయత్నాలు చేసింది. ఇప్పటికీ జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ మార్గంలో భూబాధితులు పరిహారం తేల్చే వరకు భూములు ఇచ్చేది లేదనీ చెబుతూనే కోర్టును ద్వారా రక్షణ పొందుతున్నారు. కానీ సర్కారు మాత్రం నేరుగా పరిహారం ఇవ్వకుండానే టీడీఆర్ మంజూరు చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీనికి ప్రధాన కారణం ఇప్పటికే ప్రాజెక్టు చేపట్టేందుకు హెచ్ఎండీఏను నిధుల కొరత వేధిస్తోంది. దీంతోనే గడిచిన ఏడాది కాలంలో ఏ ఒక్క ప్రాజెక్టును పట్టాలెక్కించలేదు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. ఇలా నగరంలో హెచ్ఎండీఏ చేతిలో ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి త్రిశంకు స్వర్గంలో పడి కొట్టుమిట్టాడుతున్నాయి.
మాట మార్చిన సర్కారు…
పరిహారం విషయంలో సర్కారు మాట మార్చింది. గతంలో భూసేకరణ కోసం జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాలకు వచ్చిన బాధితులకు తొలుత పరిహారాన్ని నగదు రూపంలోనే చెల్లిస్తామని స్పష్టం చేశారు. అదే సమయంలో రక్షణ శాఖకు చెందిన భూముల విషయంలో ఇస్తున్న పరిహారం తరహాలోనే, తమకు ఉండాలనీ, ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్టు ద్వారా భూములు కోల్పోతున్న వారికి పరిహారాన్ని చెక్కుల ద్వారా చెల్లించింది. కానీ ఈ ఎలివేటెడ్ ప్రాజెక్టు బాధితులకు తాజాగా దాదాపు రూ. 2200 కోట్ల భూసేకరణ పరిహారాన్ని టీడీఆర్ రూపంలో ఇవ్వనుంది. ప్రభుత్వం కూడా ఈ అంశంపై మార్గదర్శకాలు ఇవ్వనున్నట్లుగా సమాచారం. దీంతో తొలుత చెప్పినట్లుగా నగదు రూపంలో దక్కాల్సిన పరిహారం కాస్తా… టీడీఆర్ రూపంలో వస్తుందని తెలిసి బాధితులు ఆందోళన చెందుతున్నారు. భూసేకరణ ప్రక్రియ పూర్తి కాకుండా, పరిహారం తేల్చకుండా, ప్రాజెక్టు వెడల్పును సర్దుబాటు చేయకుండా పరిహారాన్ని టీడీఆర్ రూపంలో ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.