తెలుగు యూనివర్సిటీ, డిసెంబర్ 28 : మనిషి ఆనందానికి ప్రతీకగా నిలిచే ప్రకృతిలోని ఐదు అంశాలు వాచికాభినయం, మండూక శబ్ధం, యోగా, ప్రాణాయామం, పండుగల విశిష్టతను దృశ్యశ్రవనానందంగా భారతీయ విద్యాభవన్ వేదికపై కూచిపూడి శైలిలో నర్తించి ఆహుతులను రంజింపజేశారు యువ నర్తకీమణులు.
భారతీయ విద్యాభవన్ బెంగళూరు ఆధ్వర్యంలో బషీర్బాగ్లో గల భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో కొనసాగుతున్న నిసర్గ వైభవం సాంస్కృతికోత్సవంలో భాగంగా బుధవారం నిసర్గ ఉపనిషత్ – కూచిపూడి నృత్య విభావరి ఆధ్యంతం నాట్యప్రియుల ప్రశంసలు అందుకున్నది. జ్యోతి కళాక్షేత్రం నృత్య గురువు జ్యోతి రెడ్డి శిష్య బృందంతో కలిసి ప్రకృతి నుంచి మానవుల పరిణామాన్ని నృత్య శైలిలో సంగీతం ద్వారా వివరిస్తూ ఆహుతుల కండ్లకు కట్టారు. భారతీయ విద్యాభవన్ బెంగళూరు కేంద్రం జాయింట్ డైరెక్టర్ నాగలక్ష్మి, హైదరాబాద్ భారతీయ విద్యాభవన్ కేంద్రం వైస్ చైర్మన్ ఎస్. గోపాలకృష్ణన్, డైరెక్టర్ సీ.రమాదేవి తదితరులు పాల్గొని కళాకారులను ఘనంగా సత్కరించారు.