
నూతన సంవత్సర వేడుకలకు మరో రెండురోజులు మాత్రమే మిగిలింది. డిసెంబర్ 31 అంటేనే ఫుల్‌జోష్‌తో.. ఆటపాటలతో ఈవెంట్స్‌తో సందడి నెలకొంటుంది. ముఖ్యంగా నగరంలోనే అత్యంత ప్రాంతాలైన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో కొత్త సంవత్సరం వేడుకలు ప్రతియేటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. కాగా పబ్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, క్లబ్స్ ఎక్కువగా ఉన్న జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఈ ఏడాది జోష్ కనిపించడం లేదు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో పాటు వేడుకలపై ప్రభావం ఉండవచ్చనే భయాలతో ఈవెంట్స్ నిర్వాహకులు ఇప్పటిదాకా ఎలాంటి ఏర్పాట్లు చేసుకోలేదు. దేశంలోనే కొన్ని నగరాల్లో ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూ విధించడం, కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధిస్తుండడంతో ముందస్తుగానే ఈవెంట్స్‌కు ప్లానింగ్ చేసుకునే పరిస్థితి కనిపించలేదు. ఏర్పాట్లు చేసుకొని రద్దు చేసుకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో పలు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు ఈసారి వేడుకలకు దూరంగా ఉన్నాయి.
-బంజారాహిల్స్,డిసెంబర్ 29
పబ్బులోనూ లేని సందడి
వెస్ట్‌జోన్ పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట పీఎస్ పరిధిలోని పబ్స్‌లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. అయితే ఈసా రి మాత్రం పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని నిర్వాహకులు అంటున్నారు. జూబ్లీహిల్స్‌లోని పబ్స్‌లో న్యూ ఇయర్ వేడుకలు ధూంధామ్‌గా జరిగేవి. జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో సుమారు 30 పబ్స్ ఉన్నాయి. వాటితో పాటు జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్లో ప్రతియేటా గ్రాండ్‌గా వేడుకలు జరిగేవి. ఈసారి న్యూఇయర్ సందర్భంగా స్పెషల్ ఈవెంట్స్ నిర్వహణ కష్టమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఫిలింనగర్‌లోని ఎఫ్ఎన్సీసీలో ప్రతియేటా భారీ ఎత్తున న్యూఇయర్ ఈవెంట్స్ నిర్వహించేవారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఈవెంట్స్ ఆపేశామని, ఈసారి కూడా ఎలాంటి వేడుకలు లేవని నిర్వాహకులు తెలిపారు.