సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ): రానున్న బోనాల జాతరలో నాన్‌డ్యూటీ పెయిడ్, నకిలీ మద్యం విక్రయాలు జరగకుండా నిఘా పెట్టాలని రంగారెడ్డి డివిజన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నాంపల్లిలోని ఆబ్కారీ భవన్లో నిర్వహించిన రంగారెడ్డి డివిజన్ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇతర రాష్ర్టాల నుంచి అక్రమంగా తరలిస్తున్న ఎన్డీపీఎల్ మద్యంవల్ల ఆబ్కారీ ఖజానాకు గండిపడటమే కాకుండా పెద్ద ఎత్తున ప్రజల ప్రాణాలకు హాని కలిగించే నకిలీ మద్యం కూడా సరఫరా జరుగుతుందన్నారు.
ఈ రెండింటిని అరికడితేనే ఆబ్కారీ ఖజానాకు గండిపడకుండా చేయగలమన్నారు. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, గోవా, తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాల ప్రాంతాలకు పెద్ద ఎత్తున ఎన్డీపీఎల్ మద్యం సరఫరా జరుగుతుందన్నారు. దీనిని అరికట్టేందుకు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టడంతోపాటు చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి, తనిఖీలు నిర్వహించాలని అధికారులను డీసీ ఆదేశించారు. ఎన్డీపీఎల్, నకిలీ మద్యం అరికట్టేందుకు ఎక్సైజ్ సిబ్బందితో పాటు ఎన్ఫోర్స్మెంట్, డీటీఎఫ్ బృందాలు రంగంలోకి దిగి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాబోయే బోనాల జాతరలో మద్యం వినియోగం అధికంగా ఉంటుందని, దీనిని ఆసరాగా చేసుకుని మద్యం మాఫియాలు పెద్ద ఎత్తున ఎన్డీపీఎల్, నకిలీ మద్యం సరఫరా చేసే అవకాశాలున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని అధికారులు తనిఖీలు ముమ్మరం చేయాలని, గతంలో ఎన్డీపీఎల్, నకిలీ మద్యం రవాణా, సరఫరా, విక్రయాలకు పాల్పడిన పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టాలని సూచించారు. దీంతోపాటు కోర్టు కేసులు, వాహనాల డిస్పోజల్, కేసుల్లో చార్జిషీట్స్ వేయడం, నిందితులను అరెస్ట్ చేయడం వంటి రోజువారి కార్యకలాపాలను పారదర్శకంగా, నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ ఆర్.కిషన్, మలాజిగిరి, మేడ్చల్, సరూర్‌నగర్, వికారాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు కె.విజయ్, ఎన్.కె.ఫయాజోద్దీన్, ఉజ్వలారెడ్డి, విజయ భాసర్గౌడ్, ఏఈఎస్ జీవన్ కిరణ్‌తోపాటు ఏఈఎస్‌లు, సీఐలు, ఎన్ఫోర్స్మెంట్, డీటీఎఫ్ అధికారులు పాల్గొన్నారు.