అమీర్‌పేట్, మే 28: పేపర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశంలో మొట్టమొదటి జాతీయ పేపర్ ఎక్స్పో జూన్ 6 నుంచి జూన్ 8వ తేదీ వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించనున్నట్లు పేపర్స్ ఎక్స్పో ఎల్ఎల్పీ సీఈఓ నిర్మల్ కుహాద్ తెలిపారు. ఈ ఎక్స్‌పోకు సంబంధించిన వివరాలను బుధవారం బేగంపేట్‌లోని హోటల్ హరిత ప్లాజాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు.
నిర్మల్ కుహాద్ మాట్లాడుతూ.. పేపర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొదటి ఎక్స్పో ఇదేనని, దేశవ్యాప్తంగా కాగిత వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు ఈ రంగంలో చోటు చేసుకుంటున్న ఆధునిక పరిణామాలను ప్రదర్శించేందుకు ఈ ఎక్స్పో దోహదపడుతుందని తెలిపారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ ఎక్స్‌పోలో పేపర్ పరిశ్రమలోని అన్ని విభాగాలు పాల్గొంటాయన్నారు.
ఇది దేశంలో అతి పెద్ద, సమగ్ర పేపర్ పరిశ్రమ సమావేశంగా నిలవనుందని ఈ ఎక్స్‌పోలో 100కు పైగా జాతీయ అంతర్జాతీయ ప్రదర్శకులు పేపర్ తయారీ కన్వర్టింగ్, ముద్రణ, ప్యాకేజింగ్, రీసైక్లింగ్ రంగాలలో తాజా ఆవిష్కరణలు ఉత్పత్తులను ప్రదర్శించనున్నారని తెలిపారు. ఈ ఎక్స్‌పోకు దేశ నలుమూలల నుంచే కాకుండా ఆసియా, గల్ఫ్, సార్క్ దేశాల నుంచి దాదాపు పదివేల మందికి పైగా సందర్శకులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధులు అరవింద్ శర్మ, బీఆర్‌రావు, మూల్ చంద్ పారేఖ్, దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.