శామీర్‌పేట, సెప్టెంబర్ 15 : జాతీయ స్థాయిలో యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల నాణ్యతాప్రమాణాలను నిర్ణయించే నాక్ ప్రతినిధి బృందం శామీర్‌పేటలోని నల్సార్ యూనివర్సిటీని సందర్శించింది. ఐదుగురు ప్రతినిధుల బృందం మూడు రోజుల పాటు నాణ్యతాప్రమాణాలను పరిశీలించారు. ఈ బృందానికి వైస్ చాన్సలర్ కమలజీత్ సింగ్, కటక్ లా యూనివర్సిటీ ప్రొఫెసర్ మధుసూదన్ అధ్యక్షత వహించగా.. పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ తరుణ్ అరోరా మెంబర్ కో- ఆర్డినేటర్‌గా వ్యవహరించారు. కాగా, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ లా విభాగం హానరరీ డీన్ వీఆర్సీ కృష్ణయ్య, పాట్నా చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ ప్రొఫెసర్ అజయ్‌కుమార్, బనారస్ హిందూ యూనివర్సిటీ కామర్స్ విభాగం ప్రొఫెసర్ సభ్యులుగా వ్యవహరించారు. 25 ఏండ్ల నల్సార్ ప్రయాణంలో నాక్ రెండోసారి సందర్శించి, నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేసింది. ఇప్పటికే నల్సార్‌కు ఏ గ్రేడ్ ఉంది. ఈ దఫా నిర్వహించిన పరిశీలనలో 2017 నుంచి 2022 వరకు నల్సార్ విద్యా ప్రమాణాలను అంచనా వేశారు. ఈ సందర్భంగా నల్సార్ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కృష్ణదేవరావు మాట్లాడుతూ.. నాక్ ముందు యూనివర్సిటీ పనితీరును ప్రవేశపెట్టడానికి బోధన, బోధనేతర సిబ్బంది విశేషంగా కృషి చేశారన్నారు. ఈసారి నల్సార్ స్థాయి పెరుగుతుందని ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. నాక్ పర్యటన నేపథ్యంలో ఆరు నెలలుగా అవిశ్రాంతంగా శ్రమించిన నల్సార్ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.