Hyderabad | సుల్తాన్‌బజార్,డిసెంబర్ 13: అనుమానమే పెనుభూతమై ఓ కుటుంబాన్ని బలితీసుకుంది. చివరకు ఐదేండ్ల చిన్నారిని అనాథగా మార్చింది. భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందన్న తీవ్ర అనుమానంతో విచక్షణ కోల్పోయిన భర్త భార్య గొంతు కోసి, రెండేండ్ల కుమారుడి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం తానూ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హృదయ విదారక ఘటన బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారు జామున మూడు గంటల సమయంలో చోటు చేసుకుంది. అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్, బేగంబజార్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ కథనం ప్రకారం… ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ఫిరోదాబాద్కు చెందిన ఎండీ సిరాజ్ అలీ(40) 7 ఏండ్ల క్రితం బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి బేగంబజార్ తోప్‌ఖానా ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఉద్యోగ రీత్యా బ్యాంగిల్ దుకాణంలో పని చేస్తున్నాడు.
కాగా 2017లో ఎండీ సిరాజ్ అలీకి హేలియాతో వివాహమైంది. వారికి అలీజాన్(5), హైజాన్(2) ఇద్దరు పిల్లలు. కాగా భార్యా పిల్లలు ఉత్తర్‌ప్రదేశ్‌లోని సొంత గ్రామంలో ఉంచి తాను మాత్రం నగరానికి వచ్చి దుకాణంలో పనిచేసి రెండేళ్లకోసారి ఊరికి వెళ్లి వచ్చేవాడు. కాగా ఈ యేడాది నవంబర్‌లో ఊరికి వెళ్లిన సిరాజ్ డిసెంబర్ 10న తన భార్య,పిల్లలను నగరానికి తీసుకొచ్చి ఓ ఇంటిని అద్దెకు తీసుకొని అందులో ఉంచాడు. సిరాజ్ గురువారం రాత్రి భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో సిరాజ్ ఉన్మాదిగా మారి శుక్రవారం ఉదయం 3 గంటల సమయంలో భార్య హేలియాను కత్తితో గొంతు కోసి చంపాడు. తన రెండేళ్ల కుమారుడు హైజాన్‌ను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం హిందీలో సూసైడ్ నోట్ రాసి తాను ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్యహత్య చేసుకున్నాడు.
ఇదిలా ఉండగా తెల్లవారు జామున 4 గంటల సమయంలో నిద్ర లేచిన పెద్ద కుమారుడు అలీజాన్ తల్లి హేలియా రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి తీవ్రంగా భయపడి పై పోర్షన్లో నివాసం ఉండే వారికి సమాచారం అందించాడు. దీంతో స్థానికులు అక్కడికి చేరుకునే సరికి సిరాజ్ ఉరివేసుకొని కనిపించడంతో పాటు హేలియా రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే 100కు కాల్ చేసి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్, బేగంబజార్ ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో అన్ని ఆధారాలను సేకరించిన అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. భార్యపై అనుమానంతోనే హత్య చేసి ఉంటాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సూసైడ్ నోట్లో సిరాజ్.. తల్లి దండ్రులారా నన్ను క్షమించండి.. తాము చనిపోయిన అనంతరం తమ మృతదేహాలను స్వస్థలానికి తీసుకెళ్లాలని పేర్కొన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై సిరాజ్, హేలియా కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం అనంతరం సిరాజ్ సోదరుడికి మృతదేహాలను అప్పగించడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని స్వస్థలానికి మృతదేహాలను కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు.