మియాపూర్, అక్టోబర్ 27 : మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారంగా పటిష్టమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు, దీని వల్ల వీధులు రహదారులలో పరిశుభ్రత సైతం నెలకొంటుందని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నార్నె ఎస్టేట్స్, సెంట్రల్ పార్కు ఫేజ్ 2 కాలనీలలో రూ. 2 కోట్లతో చేపడుతున్న యూజీడీ నిర్మాణ పనులను కార్పొరేటర్ రాగం నాగేందర్‌యాదవ్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి విప్ అరెకపూడి గాంధీ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూజీడీ, వరద నీటి కాలువలు, సౌకర్యవంతమైన రహదారులు, పుష్కలమైన తాగునీరు, మెరుగైన విద్యుత్ వ్యవస్థ వంటి మౌలిక వసతులను నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో మెరుగు పరుస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల సౌకర్యం కోసం సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్‌ల తోడ్పాటుతో వేలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులలో ప్రజలు భాగస్వాములై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, తద్వారా మరింత నాణ్యతతో పూర్తి చేసే అవకాశాలుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, ఏఈ సునీల్, యాదగిరి, పార్టీ అధ్యక్షులు రాజుయాదవ్, శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, రాంబాబు, గోపాల్, పవన్, ప్రసాద్, అసోసియేషన్ అధ్యక్షులు రమణి, సురేశ్, రామకృష్ణ, హరినారాయణ, ప్రవీణ్, వేణు పాల్గొన్నారు.