అల్లాపూర్, నవంబర్ 5 : అల్లాపూర్ డివిజన్లోని బస్తీలు నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ఆదర్శ కాలనీలుగా మారుతున్నాయి. గతంలో సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడిన బస్తీలు, కాలనీలు.. నేడు సకల వసతులతో సుందరంగా దర్శనమిస్తున్నాయి. గత పాలకుల నిరక్ష్యం కారణంగా కాలనీలు అభివృద్ధి చెందక స్థానికులు ఇబ్బందులు పడ్డారు. గడిచిన ఏడేండ్లలో డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలు అభివృద్ధి చెందాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు కోట్లాది రూపాయల వెచ్చించి మౌలిక సదుపాయలు కల్పించేందుకు కృషిచేస్తున్నారు.
డివిజన్లోని అల్లాపూర్ ప్రధాన రహదారితోపాటు అంతర్గత రహదారుల నిర్మాణం పనులు చేపట్టి, పూర్తి చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది. డివిజన్ పరిధిలో రూ.24 కోట్లతో పనులు చేపట్టి పూర్తిచేశారు . అదేవిధంగా పలు కాలనీల్లో డ్రైనేజీ, తాగునీటి పైపులైన్ నిర్మాణం పనులు పూర్తి చేశారు. వెంటనే రోడ్డు పనులు చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
డివిజన్ పరిధిలోని పలు బస్తీలు, కాలనీల్లో అభివృద్ధి పనులు చేపట్టి అన్ని డివిజన్లకు ఆదర్శంగా నిలిచేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. డివిజన్లో నెలకొన్న సమస్యలు దశలవారీగా పరిష్కరించేందుకు నిధులు కేటాయించి పనులు చేస్తున్నారు . షటిల్, వాలీబాల్, బాస్కెట్ బాల్ వంటి ఇండోర్ గేమ్స్ ఆడేందుకు వీలుగా రూ.86 లక్షలతో గాయత్రినగర్ పార్క్లో ఇండోర్ స్టేడియాన్ని నిర్మించారు. ప్రస్తుతం అది అందుబాటులో ఉన్నది.
రూ.12 కోట్ల వ్యయంతో డ్రైనేజీ నిర్మాణం పనులు చేపట్టి పూర్తిచేయడంతో పాటు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. కాలనీలు, బస్తీలు అన్న తేడా లేకుండా పారిశుధ్య సమస్యలు పరిష్కరిస్తున్నారు. వీధిదీపాలు, విద్యుత్ స్తంభాల నిర్వహణ ఎప్పటికప్పుడు అధికారులు, స్థానిక నాయకులు పరిశీలించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అల్లాపూర్ డివిజన్ సమగ్రాభివృద్ధికి కృషిచేస్తున్న కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ సబీహా బేగంనకు స్థానికులు కృతజ్ఞతలు చెబుతున్నారు.