కేపీహెచ్‌బీ కాలనీ, జూలై 7 : నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్యలన్నీ పరిష్కరించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. నలభై ఏండ్లుగా బాలానగర్, పరిసర ప్రాంత ప్రజలు పడుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే కృష్ణారావు ప్రత్యేక చొరవచూపి ఫ్లై ఓవర్‌ను అందుబాటులోకి తెచ్చినందుకు బుధవారం బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్‌రెడ్డి, ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండాల సతీశ్‌గౌడ్‌తో పాటు పలు సంఘాల నేతలు ఎమ్మెల్యే కృష్ణారావుకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరం ఆదర్శవంతంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. నగరంలో పెరుగుతున్న జనా భా, వాహనాలకనుగుణంగా రహదారి వ్యవస్థను ఆధునీకరించడం జరుగుతుందన్నారు. కూకట్పల్లి, బాలానగర్ ప్రాం తాల్లో ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోవడంతో వాహనదారులు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారన్నారు. బాలానగర్, ఫతేనగర్తో పాటు కేపీహెచ్‌బీ కాలనీ హైటెక్‌సిటీ మార్గం లో ట్రాఫిక్ ఇక్కట్లను తొలగించే దిశగా ఫ్లై ఓవర్, అండర్‌పాస్ బ్రిడ్జిలను నిర్మించినట్లు తెలిపారు. తాజాగా బాలానగర్‌లో నిర్మించిన ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ సమస్యలన్నీ తీరినట్లేనన్నారు. ఫ్లె ఓవర్ నిర్మాణ పనుల్లో పనిచేసిన అధికారులకు, సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలన్నారు.