మియాపూర్, అక్టోబర్ 23: ప్రజా సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ పథకాలు ప్రజలనే కాకుండా విపక్ష పార్టీలను విశేషంగా ఆకర్షిస్తున్నాయని, ఫలితంగా కారు ఎక్కేందుకు క్యూ కడుతున్నారని ఆయన తెలిపారు. చందానగర్ డివిజన్‌కు చెందిన పలువురు బీజేపీ శ్రేణులు ఆ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రెడ్డి రఘునాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాసరావుల సమక్షంలో శనివారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం విప్ గాంధీ మాట్లాడుతూ ప్రజలకు అండగా ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ అభివృద్ధిలో పురోగతి సాధిస్తున్నట్లు తెలిపారు.
పేద, మధ్యతరగతి ప్రజలను అన్ని సందర్భాల్లో ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తూ వారు లబ్ధిపొందేలా కృషి చేస్తున్నారన్నారు. కల్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ, పింఛన్లు, కేసీఆర్ కిట్, దళిత బంధు, సహా మరెన్నో పథకాల ద్వారా లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజల దరిచేరనున్నాయని విప్ గాంధీ స్పష్టం చేశారు. పార్టీ పటిష్టతకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలన్నారు. కొత్త వారిని అక్కున చేర్చుకుని తగిన అవకాశాలు పార్టీ కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన వారిలో ఆశిష్ దూబే, చరణ్, అమీత్ దూబే, మనీశ్, ప్రీతం రెడ్డి, సోను, విజయ్, అభిలాష్, తరుణ్, కార్తీక్, వెంకట్, రాకేశ్ ఉన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, దామోదర్‌రెడ్డి, గురుచరణ్ దూబే, రవీంద్‌రెడ్డి, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.