అమీర్‌పేట్, ఏప్రిల్ 29 : సనత్‌నగర్ ఎస్ఆర్టీ కాలనీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి సంకేత్ స్వచ్ఛంద సంస్థ రూపొందించిన సూచనలను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అభినందించారు. శనివారం సనత్‌నగర్ కూరగాయల మార్కెట్ ప్లే గ్రౌండ్లో సంకేత్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తలసాని, కార్పొరేటర్ కొలను లక్ష్మీబాల్‌రెడ్డి, అన్ని విభాగాల అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ఎస్ఆర్టీ క్వార్టర్లకు చెందిన మురళి ఫని ఆధ్వర్యంలో కొంత మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విదార్థులు, వయోధికులు కలిసి సామాజిక బాధ్యతతో నిర్వహిస్తున్న పారిశుధ్యం, పచ్చదనం వంటి అంశాలపై నిర్వహించిన కార్యక్రమాలకు ప్రజల్లో మంచి గుర్తింపును తెచ్చిందన్నారు. అదే విధంగా అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా సనత్‌నగర్ ఎస్ఆర్టీ కాలనీని మరింత మెరుగ్గా తీర్చిదిద్దవచ్చనే విషయంలో సంకేత్ సంస్థ నుంచి వచ్చిన సూచనలను మంత్రి స్వాగతించారు. మొత్తం 1200 క్వార్టర్లు, 50కి పైగా ఉన్న పార్కులు, మైదానాలకు గూగుల్ సైతం సునాయాసంగా గుర్తించే విధంగా నంబర్లు ఏర్పాటు చేయాలన్న సంకేత్ సూచనలను అక్కడే జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్‌కు వివరిస్తూ తక్షణమే ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
సనత్‌నగర్‌ను ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దే క్రమంలో వేలాది కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తున్నామని, సనత్‌నగర్ డివిజన్ విషయానికి వస్తే నాలుగున్నర దశాబ్దాలలో జరగని అభివృద్ధిని ఏడున్నరేండ్ల కాలంలో చేసి చూపించామన్నారు. ప్రజల దాహార్తిని తీర్చే రిజర్వాయర్, ఇక్కడి క్రీడాకారుల కోసం ఇండోర్ స్టేడియం, సీసీ రోడ్లు, మెరుగైన తాగునీటి, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థలను తీర్చిదిద్దామని వివరించారు. కోట్ల నిధులు వెచ్చించి అన్ని వయసుల వారి కోసం ఇక్కడి నెహ్రూ పార్కులో ఏర్పాటు చేసిన మల్టీ జనరేషన్ థీమ్ పార్కు త్వరలో ప్రారంభం కానుందని కాలనీ నివాసితుల హర్షధ్వానాల మధ్య వివరించారు.
కాలనీలో అక్కడక్కడ చేపట్టాల్సిన పార్కుల్లో పచ్చదనం, పాడైన రోడ్లు, పారిశుధ్యం, డ్రైనేజీ పైపులైన్లు, వీధి లైట్లు వరదనీటి కాలువలకు సంబంధించిన వచ్చిన ఫిర్యాదులను వచ్చే రెండు మూడు నెలల్లో పూర్తి చేయాలని అక్కడే ఉన్న అన్ని విభాగాల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మోహన్‌రెడ్డి, జలమండలి జీఎం హరిశంకర్, డీజీఎం శ్రీనివాస్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ రమేశ్, ఏఎంవోహెచ్ డాక్టర్ భార్గవ్ నారాయణ, సంకేత్ సంస్థ ప్రతినిధులతో బీఆర్ఎస్ నాయకులు కొలను బాల్‌రెడ్డి, ఖలీల్ బేగ్, ఫాజిల్ పాల్గొన్నారు.