బేగంపేట్, సెప్టెంబర్ 15 : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు సిద్ధంగా ఉన్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. బేగంపేట్ డివిజన్ కార్పొరేటర్ మహేశ్వరిశ్రీహరి ఇటీవల డివిజన్లోని పాటిగడ్డ, ఓల్డ్ కస్టమ్స్ బస్తీలలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల నిర్వాహకులు తెలిపిన సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు అందించి సమస్యలను వివరించారు. దీంతో మంత్రి తలసాని స్పందిస్తూ.. తక్షణమే సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గంలో ఏ ప్రభుత్వ పాఠశాలలో నైనా సమస్యలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు.