అమీర్‌పేట్, సెప్టెంబర్ 11: పాఠశాలల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో రూ.2 కోట్ల వ్యయంతో పాఠశాలల్లో మెరుగైన వసతులను కల్పిస్తామని, డివిజన్లోని పాఠశాలల్లో సమస్యలను గుర్తించి తన దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు. దీంతో సనత్‌నగర్‌లోని రెండు ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డి ఇటీవల సందర్శించారు. అశోక్కాలనీ పాఠశాలలో టెర్రస్ ఫ్లోరింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో షాబాద్ ఫ్లోరింగ్, ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం, పాఠశాల ప్రహరీ ఎత్తు పెంచడం, కిటికీల మరమ్మతులు, స్టెయిర్‌కేస్ మరమ్మతులు, పాడైన తాగునీటి ట్యాంక్ నల్లాలు , పాఠశాలకు పెయింటింగ్ వంటి సమస్యలతో రూపొందించిన నివేదికను మంత్రి తలసానికి శనివారం అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో స ర్కార్ ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే పనులకు పెద్దపీట వేసిందన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు మెరుగైన వసతులతో పాటు ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం వం టివి అందుబాటులో ఉండటంతో మంచి ఫలితాలు సాధిస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 10వ తరగతి ఫలితాల్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్ర భుత్వ పాఠశాలల ర్యాంకులను సాధిస్తుండటం విశేషమన్నారు.
దీంతో ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకం మరింత పెరుగుతోందన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులు ఎందరో ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు వసతులు కల్పనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
అమీర్‌పేట్: బాపూనగర్ బస్తీలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బస్తీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిసింగ్జాదవ్ శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు వినతి పత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇవ్వడం పై బస్తీ అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు.