
రవీంద్రభారతి, ఆగస్టు17 : వైద్య విద్యలో అంతర్జాతీయ స్థాయిలో విశేషంగా కృషి చేసిన డాక్టర్ జి.భానుప్రకాశ్‌కు వైద్యాచార్య అవార్డును ప్రదానం చేశారు. మంగళవారం మంత్రి కార్యాలయంలో భానుప్రకాశ్‌కు వైద్యాచార్య అవార్డును మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. వైద్య విద్యను యానిమేషన్ రూపంలో డిజిటలీకరణ చేసి, వైద్య విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారని, లక్షలాది మంది వైద్య విద్యార్థుల మన్ననలు పొందారని మంత్రి ప్రశంసించారు. డాక్టర్ భానుప్రకాశ్ వైద్యరంగానికి అందించిన సేవలు అభినందనీయమన్నారు. డాక్టర్ ఏఎస్ రావు చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ భానుప్రకాశ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఏఎస్ రావు, సాంస్కృతిక కార్యకర్త రవికుమార్ పాల్గొన్నారు.