సొంత స్థలంలో ఇండ్ల నిర్మాణానికి గృహలక్ష్మి పథకం కింద ప్రభుత్వం రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నది. ఈ పథకంలో మొదటి విడతగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 800 మంది లబ్ధిదారులకు బుధవారం కలెక్టరేట్లో మంత్రి మల్లారెడ్డి మంజూరీ పత్రాలను అందజేశారు.
మేడ్చల్, సెప్టెంబర్20(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంతో నిరుపేదలకు సొంతింటి కల సాకారం అవుతున్నదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో గృహలక్ష్మి పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు మంత్రి మల్లారెడ్డి ఉత్తర్వుల (మంజూరు) పత్రాలను మంత్రి, అధికారులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… ఇళ్లు లేని నిరుపేదలకు గృహలక్ష్మి పథకం వరంగా మారిందని, సీఎం కేసీఆర్ నిరుపేదలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఖాళీ స్థలం ఉండి ఇళ్లు లేని అర్హులైన నిరుపేదలందరికి ఈ పథకం కింద రూ.3 లక్షలు అందించేందుకు ప్రభుత్వం అందజేస్తుందని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం మొదటి విడతలో 8 వందల మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి మంజూరు పత్రాలను అందజేశామని, త్వరలోనే మరో విడతలో మరింత మంది లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పారు.
లబ్ధిదారులు వెంటనే పనులు ప్రారంభించాలి
గృహలక్ష్మి పథకం మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని మంత్రి మల్లారెడ్డి కోరారు. పనులు ప్రారంభమైతే లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుందన్నారు. ఖాళీ స్థలం ఉన్న ప్రతి ఒక్కరూ గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ విషయంలో మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు, కౌన్సిలర్లు ప్రజలకు సహకరించి వారికి సంబంధించిన దరఖాస్తులను అధికారులకు అందజేయాలని మంత్రి పేర్కొన్నారు. ప్రజల సంక్షేమానికి చేపట్టే ప్రతి కార్యక్రమం అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి, ఈఈ శ్రీనివాసమూర్తి, మేయర్ కావ్య, చైర్మన్లు ప్రణిత, చంద్రారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
సొంతింటి కల నిజమవుతున్నది..
నిరుపేదలు ఇళ్లు కట్టుకునేందుకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయంతో సొంతింటి కలను నిజం చేసుకుంటాం. ప్రభుత్వం రూ. 3 లక్షలు అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు ఇలాంటి సహాయం ఏ ప్రభుత్వాలు చేయలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ కలను నిజం చేసేందుకు ఇంటి నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తాం.
– నీలమ్మ, అంకిరెడ్డిపల్లె
సంతోషంగా ఉంది..
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షలు అందించడం సంతోషంగా ఉంది. ఖాళీ స్థలం ఉన్నా.. ఇంటి నిర్మాణానికి నా దగ్గర పైసలు లేవు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దమనసుతో ఆలోచించి ఇళ్లు కట్టుకోలేని వారికి గృహలక్ష్మి పథకం ద్వారా సహాయం చేయడం ఎన్నటికి మర్చిపోము. ఇంటి నిర్మాణాన్ని చేసుకొని మా కలను సాకారం జేసుకుంటా.
– రామిడి రమ్య, నాగిశెట్టిపల్లి
కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటా
ముఖ్యమంత్రి కేసీఆర్ సారుకు రుణపడి ఉంటా. నాకు స్థలం ఉన్నా ఇళ్లు కట్టుకోలేని పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సారు మాలాంటి నిరుపేదల కోసం గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నరు. ఇంటి పనులు త్వరలోనే ప్రారంభిస్తాం.
– శ్రీలత,మూడుచింతలపల్లి