
సిటీబ్యూరో, జూలై 2 (నమస్తేతెలంగాణ) : పదిరోజులపాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో పారిశుధ్యానికి ప్రాధాన్యమివ్వాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ జలమండలి అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతి అమలు, ప్రణాళిక తదితరాంశాలపై శుక్రవారం ఆయన అధికారులతో సమీక్షించారు. జలమండలి పరిధిలో ఉన్న జీహెచ్ఎంసీ, పరిసర మున్సిపాలిటీల్లో నాలాల పూడికతీత, శుభ్రత చేపట్టాలని, వరదనీటి కాల్వలు సాఫీగా పారేలా చూడాలన్నారు. పారిశుధ్య కార్యక్రమాలను జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వానకాలం కావడంతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, మ్యాన్హోళ్లకి సంబంధించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇటీవల నగరవ్యాప్తంగా 11వేల మ్యాన్‌హోళ్లకు మరమ్మతులు చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.