ఖైరతాబాద్, జూన్ 14 : మాసబ్‌ట్యాంక్‌లోని తన ఫ్లాట్‌ను కొందరు రాజకీయ ప్రేరేపిత రౌడీలు బలవంతంగా బెదిరింపులు, దౌర్జన్యాలు చేసి కబ్జా చేయాలని చూస్తున్నారని సుప్రీం కోర్టు న్యాయవాది శ్రీధర్ దయాల్ తెలిపారు. ఆదివారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాసబ్ట్యాంట్ శ్రీనివాస టవర్స్‌లోని తనకు మూడు బెడ్రూం ఫ్లాట్ ఉందని, దానిని మహ్మద్ అబ్దుల్ అజీజ్, మహ్మద్ ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తులకు నోటి మాట ఒప్పందంపై కిరాయి ఇచ్చానని తెలిపారు.
అయితే వారు తనకు తెలియకుండా నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు అప్పగించడంతో తన ఫ్లాట్‌ను వివిధ రకాలుగా ధ్వంసం చేశారన్నారు. అక్రమంగా ఫ్లాట్‌ను ఆక్రమించిన షాహెద్ హఫీసుద్దీన్ అలియాస్ జైదాన్ ఖాన్ అలియాస్ నవీద్ ఖాన్, అలియాస్ మహ్మద్ జంగ్లీ ఫిబ్రవరిలో లడ్డూ గ్యాంగ్ పేరుతో కొందరు రౌడీలను తీసుకువచ్చి తన ఫ్లాట్ ఖాళీ చేయమని, కిరాయి కట్టమని బెదిరించారన్నారు. ఈ విషయంపై తాను ఈ ఏడాది ఏప్రిల్ 7న, ఆ తర్వాత 18న మెహిదీపట్నం ఎస్‌హెచ్‌వో, గోల్కొండ జోన్ డీసీపీలకు ఫిర్యాదులు చేశానని, కానీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో తనకు పోలీసు భద్రత కావాలని వ్రిట్ పిటీషన్ దాఖలు చేశానన్నారు.
ఆ తర్వాత సదరు ఫ్లాట్‌ను ఓ న్యాయవాద కుటుంబానికి అద్దెకు ఇచ్చానని, గత నెల 29న సయ్యద్ హఫీసుద్దీన్ను ఖాళీ చేయమని కోరితే ఒప్పుకొని తన వద్దే డబ్బులు తీసుకొని తాళాలు అప్పగించాడని తెలిపారు. కానీ అదే రోజు రాత్రి రౌడీలతో తిరిగి వచ్చి తాళాలు పగులగొట్టి ఫ్లాట్‌లోకి ప్రవేశించేందుకు యత్నించాడని, ఈ నేపథ్యంలో అడ్డుకోబోయిన వాచ్‌మెన్‌ను తీవ్రంగా కొట్టారన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి నా పట్టించుకోలేదని, పై నుంచి రాజకీయ ఒత్తిడి ఉందని చెప్పారన్నారు. వారి వెను క ఎంఐఎం ఎంపీ, ఎమ్మెల్యే హస్తం ఉందని తన దృష్టికి వచ్చిందని, దాడులకు పాల్పడుతున్న వారందరూ వారి మనుషులేనని తెలిసిందన్నారు. ఎన్ని దాడులు చేసినా తాను న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు.