సిటీబ్యూరో, జూన్ 14(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో భద్రతను మరింత బలోపేతం చేసేందుకు సిటీ పోలీస్ సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. మార్గదర్శక్ కార్యక్రమానికి అనుబంధంగా కొత్తంగా పోలీసు మెంటార్స్‌ను తీసుకొస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రకటించారు. ఇకపై ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక కానిస్టేబుల్‌ను మెంటార్‌గా నియమిస్తామని, వారు క్షేత్రస్థాయిలో మార్గదర్శక్ వలంటీర్లతో కలిసి నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనిచేస్తారని ఆయన తెలిపారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ ఆడిటోరియంలో హెచ్సీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన మార్గదర్శక్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో సీపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్న 60మంది వలంటీర్లకు సర్టిఫికెట్లు ప్రదానం చేయడంతోపాటు మార్గదర్శక్ లోగోను ఆవిష్కరించి రెండోదశ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నగరంలో ప్రజాభద్రత, మహిళాభద్రత, అత్యవసర సేవలలో భాగంగా ఉంటూ ప్రజలను చైతన్యవంతమైన వలంటీర్లుగా తీర్చిదిద్దడమే మార్గదర్శక్ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. బాధితులకు తక్షణ అండగా నిలుస్తూ, పోలీసు వ్యవస్థకు ఫోర్స్ మల్టీప్లయర్స్గా పనిచేసేలా పౌరులను సిద్ధం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. వలంటీర్లకు ప్రజాభద్రత, ఎమర్జెన్సీ రెస్పాన్స్, మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చామని, వీరంతా ఇకపై సేఫ్టీ అంబాసిడర్స్‌గా నగర భద్రతలో కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు.
ఆపదలో ఉన్న మహిళలు తమ ఇబ్బందులను మహిళా సిబ్బంది వద్ద స్వేచ్ఛగా, నిర్భయంగా చెప్పుకోగలరన్న వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని బాధితులకు తక్షణ సాయం, భరోసా అందించేందుకు స్పందన-ఆల్ ఉమెన్ ఫస్ట్ రెస్పాండర్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని, వీరంతా మార్గదర్శక్, పోలీసు మెంటార్లతో కలిసి పనిచేస్తూ మహిళా భద్రతకు ఒక బలమైన రక్షణ కవచంలా మారుతారన్నారు. రాబోయే రోజుల్లో రిటైర్డ్ అధికారులు, విద్యావేత్తలు, నిపుణుల సేవలను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తామని, మార్గదర్శకులు మొదటిస్థాయిలో సేవలందిస్తే, ఆయా స్టేషన్లలోని పోలీసు మెంటార్లు వారికి నిరంతర తోడ్పాటును అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా భద్రతా విభాగం డీసీపీ డాక్టర్ లావణ్య, హెచ్సీఎస్సీ సెక్రటరీ సీ.శేఖర్‌రెడ్డి, మహిళా ఫోరం జాయింట్ సెక్రటరీ ఖ్యాతి నారవనే తదితరులు పాల్గొన్నారు.