పాలకుల నిర్లక్ష్యం హైదరాబాద్ మెట్రో పాలిట శాపంగా మారింది. వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రూపొందించిన మెట్రో విస్తరణ ప్రణాళికలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నాన్చివేత, కమిటీల అధ్యయనాల్లో జరుగుతున్న కాలయాపన ఫలితంగా ప్రాజెక్టు అంచనా వ్యయం నానాటికీ పెరిగిపోతున్నది. గతంలో పంపిన డీపీఆర్ ప్రకారం కిలోమీటర్ నిర్మాణానికి రూ. 270 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయగా.. తాజాగా ఇది రూ. 314 కోట్లకు చేరినట్టుగా తెలిసింది.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 23 (నమస్తే తెలంగాణ) : మెట్రో ప్రాజెక్టు ఆలస్యం అవుతున్నకొద్దీ ఏటా కిలోమీటర్‌కు రూ.44 కోట్ల వరకు అదనపు భారం పడుతున్నదని, ప్రాజెక్టు ప్రాథమిక ప్రతిపాదనలు, కారిడార్ల విభజన, సవరణల కారణంగా మొత్తం ప్రాజె క్టు నిర్మాణ వ్యయంలో వచ్చిన వ్యత్యా సం దాదాపు రూ. 4 వేల కోట్లకు మించిపోయేలా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పార్ట్-ఏ, పార్ట్-బీ కింద ప్రతిపాదించిన మెట్రో రైలు ఏడు కారిడార్లతో 130 కిలోమీటర్లకు రూ. 36,680 కోట్లతో పంపిన డీపీఆర్‌కు మళ్లీ సవరణలు చేస్తే ఏకంగా రూ. 40వేల కోట్లకు పైగా చేరనున్నది.