ఖైరతాబాద్, మే 10: సమాజంలో విపరీత ధోరణుల నివారణకు సైకాలజిస్టులు పాటుపడాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి సూచించారు. సోమాజిగూడలోని హోటల్ కత్రియాలో జరిగిన తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ వార్షికోత్సవ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం మహిళలపై ఆకృత్యాలు, హత్యలు పెరిగిపోయాయని, అలాగే ఆత్మహత్యల సంఖ్య కూడా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సైకాలజిస్టులు మనుషుల్లో మానసిక పరివర్తన తీసుకువచ్చేందుకు కృషి చేయాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే మానసిక ధోరణులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.
తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మోతుకూరి రాంచందర్ మాట్లాడుతూ.. మానసిక వైకల్యం కలిగిన వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత సైకాలజిస్టులపై ఉందన్నారు. యువతలో పెరుగుతున్న ఒత్తిళ్ల కారణంగానే అనేక రుగ్మతలు వస్తున్నాయని, వాటిని నివారించేందుకు సైకాలజిస్టులు కృషి చేయాలన్నారు. ఉచిత అవగాహన క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ త్రిపురణ వెంకటరత్నం, సైక్రియాటిస్ట్ డాక్టర్ హరిణి, డాక్టర్ శిల్ప, శ్రీపూజ, సుధాకర్, రాజు ఆచార్య, బీ నారాయణ రావు, పున్నంచందర్, అర్చన, అలియాపర్వీన్, కృష్ణ సాహితి, రోజా, సునయన, విశాల తదితరులు పాల్గొన్నారు.