సిటీబ్యూరో, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ): మేకల కల్యాణ్ అనే వ్యక్తిని పిక్‌పాకెటింగ్ కేసులో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు కడ్తాల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ స్పష్టం చేశారు. ఇటీవల కడ్తాల్ పోలీసులు తమ నివాసానికి వచ్చి, ఇంట్లో ఉన్న తన కుమారుడైన కల్యాణ్‌ను ఎలాంటి కేసు నమోదు చేయకుండా, కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వకుండా అదుపులోకి తీసుకున్నారని ఆరోపిస్తూ అతడి తల్లి అలివేలు రాష్ట్ర మానవ హకుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు తన కుమారుడి ఆచూకీని వెల్లడించడానికి లేదా కోర్టు ముందు హాజరుపర్చడానికి నిరాకరిస్తున్నట్లు ఫిర్యాదులో పేరొన్నారు.
బాధితురాలి ఫిర్యాదుపై స్పందించిన కమిషన్ ఈనెల 5వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. దీనిపై కడ్తాల్ ఇన్స్పెక్టర్ గంగాధర్‌ను వివరణ కోరగా.. ఇటీవల ఓ వ్యక్తి కడ్తాల్ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులో ప్రయాణిస్తుండగా మేకల కల్యాణ్ మరో ముగ్గురితో కలిసి పిక్‌పాకెటింగ్‌కు పాల్పడటమే కాకుండా ఏటీఎం ద్వారా బాధితుడి ఖాతాలో నుంచి డబ్బు కాజేసినట్లు తెలిపారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఇన్స్పెక్టర్ వివరించారు. నిందితుడిపై గతంలో కూడా పలు కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు. ఒక బాలుడు, మహిళ, మరో వ్యక్తితో కలిసి కల్యాణ్ ముఠాగా ఏర్పడి పిక్‌పాకెటింగ్‌లకు పాల్పడుతున్నట్లు వివరించాడు.