సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వైద్య విప్లవం మొదలైందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం తనను తాను పునర్నిర్మించుకుంటున్న సమయంలో వైద్యరంగంలో పెనుమార్పులు వస్తున్నాయని తెలిపారు. నగరంలోని పాణినీయ డెంటల్ కళాశాలలో శనివారం జరిగిన స్నాతకోత్సవంలో జూలూరు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ 33 జిల్లాల్లో 33 వైద్యకళాశాలలు నిర్మించే బృహత్తర కార్యక్రమం పూర్తికావొస్తుందని తెలిపారు. పదేండ్లలోనే తెలంగాణ నుంచి వైద్యుల సంఖ్య క్యూబా దేశంలోని డాక్టర్లను మించిపోయే దశకు చేరుకుంటుందని అన్నారు. డీసీపీ శ్రీసాయి మాట్లాడుతూ.. వృత్తి జీవితంలోకి అడుగుబెట్టబోతున్న మీరంతా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.కరుణాకర్ అధ్యక్షత వహించగా, గురునానక్ విద్యాసంస్థల వీసీ జీఎస్ కోహిలి, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్యస్ సైనీ, డెంటల్ సర్జరీ ఇన్చార్జి డాక్టర్ వీజీరెడ్డి పాల్గొన్నారు.