సిటీబ్యూరో: ఇన్సులిన్ మందుల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడుతున్న మెడికల్ ఏజెన్సీలపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు.ఈ క్రమంలోనే నగరంలోని ఆరు మెడికల్ ఏజెన్సీల లైసెన్స్‌లను నెల రోజల పాటు సస్పెండ్ చేశారు.వారి వద్ద నుంచి రూ. 51.92 లక్షల విలువైన ఇన్సులిన్ ఇంజెక్షన్లను సీజ్ చేశారు. డీసీఏ డైరెక్టర్ జనరల్ కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం….నగరంలో పలు మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు పోటీపడి.. 40 శాతానికి పైగా డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. దీంతో అనుమానం వచ్చిన డీసీఏ అధికారులు.. మార్చి 15 నుంచి నగరంలోని పలు మెడికల్ ఏజెన్సీలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో నగరంలోని ఆరు మెడికల్ డిస్టిబ్యూటర్లపై దాడులు జరిపి, సేల్ బిల్స్‌ను పరిశీలించగా, వాటికి కొనుగోలు చేసిన బిల్లులు లేవని తేలింది.
అంతే కాకుండా ఈ మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ ఢిల్లీ నుంచి ఎలాంటి బిల్లులు లేకుండా తక్కువ ధరకు ఇన్సులిన్ ఇంజెక్షన్లను కొనుగోలు చేసి, నగరంలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేలింది. డీసీఏ నిబంధనల ప్రకారం బిల్లులు లేకుండా ఔషధాలను కొనుగోలు చేయడం డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ చట్టం 1940 ప్రకారం నేరం. బిల్లులు, సంబంధిత తయారీ కంపెనీకి పత్రాలు లేకుండా అక్రమంగా ఔషధాలు కొనుగోలు చేయడం వల్ల సదరు ఔషధాల నాణ్యత, కచ్చితత్వం ప్రశ్నార్థకంగా ఉంటున్నది. ఇలాంటి మందులు వాడటం రోగులకూ ప్రమాదకరమే. అంతే కాకుండా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును కూడా ఈ మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ యధేచ్ఛగా ఎగ్గోడుతున్నారు.
ఈ మేరకు కొన్ని రోజులుగా నగరంలోని మెడికల్ డిస్ట్రిబ్యూటర్లపై నిఘా పెట్టగా, ఆరు మంది మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ అనధికారికంగా ఢిల్లీ నుంచి తక్కువ ధరకు ఇన్సులిన్ ఇంజెక్షన్లను బిల్లులు లేకుండా కొనుగోలు చేసి, నగరంలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేలింది. సోమవారం సికింద్రాబాద్, పద్మారావునగర్‌లోని డ్రగ్ హబ్‌పై దాడులు జరిపి, 6.70 లక్షల విలువైన ఇన్సులిన్ ఇంజెక్షన్లను సీజ్ చేశారు.
ఉప్పల్, రామంతాపూర్‌లోని శ్రీ తిరుమల ఫార్మాపై దాడులు జరిపి రూ. 3.52 లక్షల విలువ చేసే ఇన్సులిన్‌ను, సుల్తాన్‌బజార్‌లోని శ్రీ పరాస్ మెడికల్ ఏజెన్సీపై దాడులు జరిపి రూ. 9 లక్షల విలువ చేసే ఇన్సులిన్, నాగోల్, సాయినగర్‌లోని శ్రీగణేశ్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ వద్ద నుంచి రూ.14.లక్షల విలువ చేసే ఇన్సులిన్, కాప్రాలోని శ్రీరాజ రాజేశ్వర డిస్ట్రిబ్యూటర్స్ వద్ద నుంచి రూ. 2.70 లక్షల విలువైన ఇన్సులిన్‌ను, కాచిగూడలోని శ్రీబాలాజీ ఏజెన్సీ నుంచి రూ.16 లక్షల విలువైన ఇన్సులిన్లను సీజ్ చేశారు. ఈ ఆరు మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ లైసెన్స్‌లను నెలరోజుల పాటు సస్పెండ్ చేస్తూ డీసీఏ డీజీ కమలాసన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.