ఉస్మానియా యూనివర్సిటీ, మే 22: భారతదేశం తొలిసారిగా నిర్వహించిన అణుపరీక్ష (స్మైలింగ్ బుద్ధ) జరిగి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (టీఏఎస్), నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియా (ఎన్ఏఎస్ఐ) లోకల్ చాప్టర్ సంయుక్తాధ్వర్యంలో స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఐఐసీటీలోని వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ చైర్మన్, కేంద్ర కేబినెట్ శాస్త్ర సాంకేతిక సలహా కమిటీ మాజీ చైర్మన్, అణు పరీక్షల్లో కీలక పాత్ర పోషించిన పద్మవిభూషణ్ డాక్టర్ ఆర్.చిదంబరం పాల్గొని, ‘మే 1974 టెస్ట్ అండ్ బియాండ్’ అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలిసారి అణుపరీక్షలను 75 మందితో కూడిన బృందం నిర్వహించిందని చెప్పారు. ఈ బృందంలో తాను కూడా కీలక సభ్యుడిని కావడం గర్వంగా ఉందన్నారు.
అణుపరీక్ష నిర్వహించిన సమయంలో అక్కడ విడుదలైన శక్తికి ఆ ప్రదేశానికి అతిసమీపంలోని రాళ్లు ఆవిరయ్యాయని, మరికొన్ని రాళ్లు కరిగిపోయాయని, కాస్త దూరంలోని రాళ్లు పైకెగిరి పగిలిపోయాయని చిదంబరం వివరించారు. నాటి అణుపరీక్షలతో దేశం మొత్తం గర్వపడిందని గుర్తు చేశారు. విదేశాల్లో సైతం దేశ కీర్తిప్రతిష్టలు పెరిగాయన్నారు. ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా..శాస్త్ర సాంకేతిక అంశాలకు అండగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. గౌరవ అతిథిగా న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ కోమల్ కపూర్ హాజరైన ఈ కార్యక్రమంలో టీఏఎస్ అధ్యక్షుడు, సీసీఎంబీ మాజీ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ మోహన్రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీఏఎస్ ప్రధాన కార్యదర్శి, ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ఎస్. సత్యనారాయణ, కోశాధికారి ప్రొఫెసర్ ఎస్ఎం రెడ్డి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యురాలు డాక్టర్ ఏ. జ్యోతి, యూజీసీ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.