బంజారాహిల్స్, ఫిబ్రవరి 26:మ్యాట్రిమోనియల్ సైట్లో పెండ్లి ప్రతిపాదనతో వచ్చిన ఓ వ్యక్తి తమ బ్యాంకు ఖాతాలు సీజ్ అయ్యాయంటూ పెండ్లి కూతురిని నమ్మించి రూ.10లక్షలు కాజేయడంతో పాటు ఫొటోలు మార్ఫింగ్ చేసి పరువు తీస్తానంటూ బెదిరింపులకు గురిచేస్తున్న ఘటన జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నం. 78లో నివాసం ఉంటున్న యువతి(31) గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నది. ఇటీవల పెండ్లి సంబంధాల కోసం షాదీ డాట్ కామ్‌లో ప్రకటన ఇవ్వగా.. హర్ష చెరుకూరి అనే యువకుడికి చెందిన వివరాలను నిర్వాహకులు అందజేశారు.
యువతి నంబర్‌ను హర్షకు ఇచ్చారు. దీంతో గత నెల 30వ తేదీ నుంచి వారిద్దరూ వాట్సాప్‌లో చాటింగ్ ద్వారా మాట్లాడుకుంటున్నారు. తన తల్లి డా.లక్ష్మి హరిత చికాగోలోని నార్త్ వెస్టర్న్ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తుందని హర్ష నమ్మించాడు. తమకు పెద్ద ఎత్తున వ్యాపారాలు ఉన్నాయని, ఇటీవల ఐటీ శాఖ దాడులతో బ్యాంక్ అకౌంట్స్ సీజ్ అయ్యాయని చెప్పాడు. త్వరలోనే తల్లి ఇండియాకు వచ్చి పెండ్లి గురించి ఫైనల్ చేస్తుందని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన ఆ యువతి అతడితో మరింత సన్నిహితంగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఈ క్రమంలో తనకు చెందిన కొన్ని ఫొటోలు అతడికి పంపించింది. కాగా, ఇటీవల యువతికి ఫోన్ చేసిన హర్ష తనకు అర్జెంట్‌గా కొంత డబ్బు కావాలని, తమ అకౌంట్స్ సీజ్ కావడంతో పాటు పాన్ కార్డును ఐటీ అధికారులు తీసుకువెళ్లారని నమ్మించాడు. దీంతో అతడు సూచించిన నంబర్లకు పలు దఫాలుగా రూ.10.94లక్షలను యువతి పంపించింది. త్వరలోనే డబ్బులు పంపిస్తానని, ఫిబ్రవరి 21న తల్లి అమెరికా నుంచి వచ్చాక నిశ్చితార్థం ఉంటుందని చెప్పాడు.
కాగా, ఈనెల 21న తల్లి వస్తుందని చెప్పిన హర్ష ముఖం చాటేయడంతో అనుమానం వచ్చిన ఆ యువతి తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరింది. దీంతో తీవ్ర పదజాలంతో దూషించిన హర్ష అంతుచూస్తానంటూ బెదిరింపులకు దిగాడు. అంతటితో ఆగకుండా తన వద్దనున్న యువతి ఫొటోలను మార్ఫింగ్ చేసి నగ్న వీడియోలు, ఫొటోలు తయారు చేయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయిస్తానంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. తనకు రూ.10లక్షలు ఇస్తే ఫొటోలు డిలీట్ చేస్తానని, లేకుంటే మార్ఫింగ్ ఫొటోలతో జీవితం నాశనం చేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన ఆ యువతి జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. షాదీ డాట్ కామ్ ప్రతినిధులకు ఫిర్యాదు చేసి వాకబు చేయగా.. అక్కడ కూడా తప్పుడు వివరాలు ఇచ్చినట్లు తేలింది. దీంతో ఈ మేరకు బాధితురాలు బుధవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. హర్ష చెరుకూరి అనే వ్యక్తిపై బీఎన్ఎస్ 79, 351(2), 319(2), 318(4)తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.