సిటీబ్యూరో, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): పెండ్లి చేసుకుంటానంటూ నమ్మించి నగరానికి చెందిన ఓ మహిళకు సైబర్ నేరగాడు రూ.4.8 లక్షలు టోకరా వేశాడు. వివరాల్లోకి వెళితే.. మెట్టుగూడకు చెందిన బాధితురాలు క్రిస్టియన్ మ్యాట్రీమోనీలో తన ప్రొఫైల్ అప్లోడ్ చేసింది. అది చూసిన సైబర్ నేరగాడు తాను టాంజేనియా దేశస్థుడినని, ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నానంటూ పరిచయం చేసుకున్నాడు. మీ ప్రొఫైల్ నచ్చిందని, నేను పెండ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ చెప్పాడు. పెండ్లికి ఒప్పుకోగానే కొన్ని రోజులు ఫోన్లో మాట్లాడుకొని, చాటింగ్ చేసుకున్నారు. ఇంతలో విలువైన గిఫ్ట్‌ను లండన్ నుంచి పంపిస్తున్నానని అందులో పౌండ్లు, ఆభరణాలు ఉంటాయంటూ చెప్పాడు. రెండు రోజుల్లోనే తాము ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి మాట్లాడుతున్నామని, మీ పేరుతో గిఫ్ట్ ప్యాక్ వచ్చిందని, అందులో పౌండ్లు, ఆభరణాలున్నాయంటూ తెలిపారు. అయితే వీటికి కస్టమ్స్ క్లియరెన్స్ లేదని దానికి సంబంధించిన ఫీజు చెల్లించాలంటూ సూచిస్తూ వివిధ ఫీజుల పేరుతో దఫదఫాలుగా రూ.4.8 లక్షలు కాజేశారు. ఇంకా డబ్బు అడుగుతుండటంతో అనుమానం వచ్చిన బాధితురాలు మంగళవారం సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.