చాంద్రాయణగుట్ట, ఫిబ్రవరి 11: పాతనగరంలో శతాబ్ధికి పైగా చారిత్ర కలిగిన లాల్‌దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ విస్తరణ పనులకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆలయం అభివృద్ధికి రూ.8.95 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అసెంబ్లీ హాల్లో జరిగిన సమావేశంలో శనివారం స్పష్టం చేశారు. తెలంగాణ బోనాల పండుగ ఉత్సవాల్లో లాల్‌దర్వాజాలోని అమ్మవారి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది.
ప్రతి ఏడాది బోనాల ఉత్సవాల్లో ఎంతో మంది ప్రముఖులు పాల్గొని తమ మొక్కులు తీర్చుకుంటారు. అయితే, ఈ ఆలయం పరిసరాలు కొంత ఇరుకుగా ఉండటంతో అమ్మవారి దర్శనం సందర్భంగా భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భక్తుల ఇబ్బందులు తొలగిపోయి.. ఈ ఆలయం పుణ్యక్షేత్రంగా మారనున్నది. త్వరలోనే అమ్మవారి ఆలయ విస్తరణ పనులు పూర్తి స్థాయిలో కొనసాగనున్నాయి. వచ్చే ఉత్సవాల నాటికి పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని తెలిపారు.
సీఎం కేసీఆర్ హామీతో ఆలయ అభివృద్ధికి పునాది..
బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా 2014లో సీఎం కేసీఆర్ అమ్మవారికి బంగారు బోనం సమర్పించి, మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వేదిక పైనుంచి భక్తులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. పాతనగరంలో ఇంతటి ప్రాముఖ్యత ఉన్న అమ్మవారి ఆలయం ఇరుకు గల్లీలో ఉండటం బాధాకరంగా ఉన్నదన్నారు. ఆలయ ప్రతినిధులతోపాటు ఆలయం చుట్టూ నివాసాలు ఉన్న భక్తులు సహకరిస్తే కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి, విస్తరణ పనులు చేపడతామన్నారు. సింహవాహిని అమ్మవారి ఆలయాన్ని ఓ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని సీఎం హామీ ఇచ్చారు. సీఎం ఇచ్చిన హామీ నెరవేరుతుండటంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆలయం అభివృద్ధిపై అసెంబ్లీలో..
అమ్మవారి ఆలయం అభివృద్ధికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తన ప్రసంగంలో అమ్మవారి ఆలయ విస్తరణ పనులను ప్రస్తావించడంతో శనివారం అసెంబ్లీ హాల్లో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, అహ్మద్ బాలల ఇతర అధికారులతో కలిసి ఆలయ విస్తరణ పనులపై చర్చించారు.
అమ్మవారి ఆలయం చుట్టూ ఉన్న నివాసాలకు సంబంధించి పరిహారం చెల్లించేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందని, మొత్తం 11 వందల గజాల స్థలం అమ్మవారి ఆలయం విస్తరణ కోసం భక్తులు అప్పగిస్తున్నట్లు స్పష్టం చేశారు. అమ్మవారి ఆలయాన్ని పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి తెలంగాణ ప్రభుత్వం రూ.8.95 కోట్లు మంజూరు చేసిందని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే ఆలయ విస్తరణ పనులు మొదలై.. పండుగ నాటికి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.