హైదరాబాద్, ఏప్రిల్ 29 : హైదరాబాద్‌లోని అతిపెద్ద విద్యార్థి స్వచ్ఛంద సంస్థ ‘స్ట్రీట్ కాజ్’ (Street Cause) నిర్వహించిన “స్ట్రీట్ కాజ్ x కేటీఆర్: షేపింగ్ ది నెక్స్ట్ జనరేషన్ లీడర్స్” నాయకత్వ సదస్సు ఘనంగా ముగిసింది. ఈ సదస్సులో జెన్‌జీతో ముఖాముఖిలో పాల్గొన్న కేటీఆర్ దేశ నిర్మాణంలో యువత పాత్రపై కీలక ప్రసంగం చేయడమే కాకుండా విలువైన సూచనలు చేశారు. ఉడుకురక్తం నిండిన యువతతో సంభాషించడం చాలా సంతోషంగా ఉందిన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు కేటీఆర్.
బంజారాహిల్స్‌లో జరిగిన “స్ట్రీట్ కాజ్ x కేటీఆర్: షేపింగ్ ది నెక్స్ట్ జనరేషన్ లీడర్స్” కార్యక్రమంలో కేటీఆర్‌తో జరిగిన ముఖాముఖి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నాయకత్వం, పాలన, వ్యవస్థాపకత, దేశ నిర్మాణంలో యువత పాత్రపై ఆయన కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ తన బాల్య స్మృతులను, తన నాయకత్వ దృక్పథాన్ని ప్రభావితం చేసిన సందర్భాలను విద్యార్థులతో పంచుకున్నారు. హైదరాబాద్ అభివృద్ధి గురించి వివరిస్తూనే, యువత మార్పును తెచ్చే ‘చేంజ్ మేకర్స్’గా ఎదగాలని, దేశ అభివృద్ధిలో అర్థవంతమైన పాత్ర పోషించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
Glad to interact with the energetic team of @StreetCause, a student-led NGO shaping socially responsible young leaders across colleges.
Their journey of impacting 1.3M+ lives over 17 years reflects the true power of youth-driven change.
Proud to support their mission and launch… pic.twitter.com/tmE3uCoC0N
— KTR (@KTRBRS) April 28, 2026
నేటి ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావంపై ఈ సందర్భంగా లోతైన చర్చ జరిగింది. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులు కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కేటీఆర్ సూచించారు. అలాగే రాజకీయ నాయకులపై జెన్-జీలో ఉండే సాధారణ అపోహల గురించి జరిగిన “మిత్ వర్సెస్ ఫ్యాక్ట్” సెషన్ ఆసక్తికరంగా సాగింది. విద్యార్థుల ప్రశ్నలకు కేటీఆర్ నేరుగా సమాధానమిస్తూ, పాలన, ప్రజా జీవితంలోని వాస్తవాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన “మాక్ షార్క్ ట్యాంక్”లో విద్యార్థులు సమర్పించిన వినూత్న ఆలోచనలను కేటీఆర్ ఒక ఇన్వెస్టర్ తరహాలో పరిశీలించి మార్గదర్శకత్వం అందించారు. అలాగే కేటీఆర్ నాయకత్వ ప్రస్థానాన్ని వివరిస్తూ ఒక వాలంటీర్ సమర్పించిన ర్యాప్ ప్రదర్శన యువతను ఆకట్టుకుంది. స్ట్రీట్ కాజ్ సంస్థ సాగిస్తున్న 17 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి మద్దతుగా, కేటీఆర్ ఆ సంస్థకు రూ.17 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. అంతేకాకుండా, ఈ సంస్థకు సలహాదారుగా వ్యవహరించడానికి ఆయన అంగీకరించారు. ఇదే వేదికపై, విరాళాల సేకరణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘donate.streetcause’ అనే ప్లాట్‌ఫామ్‌ను కేటీఆర్ ప్రారంభించారు. సామాజిక సేవా కార్యక్రమాలకు నిరంతర మద్దతు లభించేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది.

నగరంలోని 50కి పైగా కళాశాలల నుండి 300 మందికి పైగా జెన్-జీ (Gen Z) వాలంటీర్లు, కోఆర్డినేటర్లు, సీనియర్ నాయకత్వ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2009లో స్థాపితమైన స్ట్రీట్ కాజ్ సంస్థ, విద్యార్థుల నేతృత్వంలోని సామాజిక మార్పులో అగ్రగామిగా ఉంది.
ఇప్పటివరకు రూ.6 కోట్లకు పైగా వ్యయంతో 15,000 పైచిలుకు ప్రాజెక్టులను పూర్తి చేసి, 13 లక్షల మందికి పైగా ప్రజలపై, 1,000కి పైగా జంతువులపై సానుకూల ప్రభావం చూపింది. 4,000 మంది క్రియాశీల వాలంటీర్లు, 45,000 మందికి పైగా పూర్వ సభ్యుల బలమైన నెట్‌వర్క్‌తో, ఈ సంస్థ భారతదేశంలోని పలు నగరాల్లో ఉనికిని చాటుకుంటూ జాతీయ స్థాయి ఎన్జీఓగా విస్తరించింది. సామాజిక అభివృద్ధిలో విశేష కృషి చేసిన వాలంటీర్లకు గుర్తింపు వేడుకతో కార్యక్రమం ముగిసింది. యువతను సాధికారత దిశగా నడిపిస్తూ, మెరుగైన భవిష్యత్తు కోసం వారిని బాధ్యతాయుతమైన నాయకులుగా తీర్చిదిద్దాలన్న స్ట్రీట్ కాజ్ నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబించింది.