ORR | సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): ఐటీ కారిడార్‌లో గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఐటీ కారిడార్‌ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దే క్రమంలో గత కేసీఆర్ ప్రభుత్వం కోకాపేటలో సుమారు 534 ఎకరాల విస్తీర్ణంలో కోకాపేట నియోపోలిస్ లేఅవుట్‌ను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) చేపట్టింది. ఇందులో భాగంగానే కోకాపేట నియోపోలిస్ లేఅవుట్‌ను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న ఓఆర్ఆర్ ట్రంపెట్ పనులు చివరి దశలో ఉన్నాయి.
ఐటీ కారిడార్‌లో అత్యాధునిక మౌలిక వసతుల అభివృద్ధి చేసిన లేఅవుట్లో ఇప్పటికే భారీ బహుళ అంతస్థుల నిర్మాణాలు మొదలయ్యాయి. దానికి అనుగుణంగానే లేఅవుట్లో రోడ్డు, డ్రైనేజీ, మంచినీరు, విద్యుత్, వీధిదీపాలు, ల్యాండ్ స్కేపింగ్ వంటి పనులను కాంట్రాక్టు సంస్థ పూర్తి చేసింది. ఇదే లేవుట్‌ను కలుపుతూ ఔటర్ రింగు రోడ్డు మీదకు నేరుగా వెళ్లేందుకు, వచ్చేందుకు ఓఆర్ఆర్పై ట్రంపెట్ నిర్మాణం చేపట్టింది హెచ్ఎండీఏ. ట్రంపెట్ నిర్మాణం పనులు తుది దశలో ఉన్నాయి.
త్వరలోనే బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. కొత్తగా అభివృద్ధి ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు విశాలమైన రోడ్లు, అనుసంధాన రోడ్లను నిర్మిస్తున్నామని అధికారులు తెలిపారు. ముఖ్యంగా కోకాపేట నియోపోలిస్ లేఅవుట్లో 50 నుంచి 60 అంతస్తులతో కూడిన ఆకాశహార్మ్యాలే అధికంగా నిర్మాణం అవుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందుల లేకుండా ఉండేందుకు ఓఆర్ఆర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వైపు సాఫీగా వాహనాలు వెళ్లేందుకు వీలుగా ఈ ట్రంపెట్‌ను నిర్మిస్తున్నామని, త్వరలోనే నిర్మాణం పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు.