సుల్తాన్‌బజార్, జూన్ 27: కల్కి సినిమా షో పీవీఆర్ ఐనాక్స్‌లో అభిమానులకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం 3.50 నిమిషాల అయ్యింది. దీంతో ఆందోళనకు గురైన అభిమానులు.. ప్రత్యేక షో ఏర్పాటు చేయాలని నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ కిరణ్‌కుమార్ రెడ్డి, ఏఎస్ఐలు ప్రేమ్‌దాస్, సతీష్‌కుమార్‌తో పాటు ఇతర పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకొని నిరసన తెలుపుతున్న వారిని సముదాయించేందుకు ప్రయత్నించారు. 3.50 నిమిషాల షోను రద్దు చేసిన ఐనాక్స్ యాజమాన్యం.. 3.55 నిమిషాలకు రూ.410 టికెట్ ధరతో అదే స్క్రీన్‌పై సినిమాను ఎలా నడిపిస్తారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయమై ఐనాక్స్ సిబ్బందితో పోలీసులు మాట్లాడగా.. తాము మూడు గంటల ముందే సాంకేతిక కారణాల వల్ల షో రద్దు అయ్యిందని సమాచారమిచ్చామని.. అయితే అభిమానులు మాత్రం ఎలాంటి సమాచారం రాలేదని మండిపడ్డారు. టికెట్ డబ్బును వెంటనే రీఫండ్ చేయాలని, లేదంటే ప్రత్యేక షోను ఏర్పాటు చేయాలని అభిమానులు డిమాండ్ చేశారు. చేసేదేమీ లేక ఐనాక్స్ యాజమాన్యం స్పందించింది. రద్దయిన షోకు టికెట్ బుక్ చేసుకున్న వారికి నగదును రీఫండ్ చేయడంతో అభిమానులు శాంతించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.