రవీంద్రభారతి,డిసెంబర్ 3: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను యధావిధిగా అమలు జరుపు జరపాలని, ఎంబీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యులు జూలూరు గౌరీశంకర్ డిమాండ్ చేశారు. బీసీలను సంపన్నులను చేస్తామని వేలాది కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పిన మాటను తూచ తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బహుజన ఉద్యమంలో భాగంగా బీసీ కవులు రచయితలు, కళాకారులు ఏకమై నిలవాల్సిన తరుణం ఆసన్నమైనదన్నారు.
అన్ని ప్రగతిశీల ఉద్యమాలలో పాల్పంచుకున్న బీసీ కవులు, రచయితలు బహుజన రాజ్యాధికార లక్ష్యంగా రచనలు చేయాలని కోరారు. సంపదలు, అధికారాల్లో బీసీలు తమ వాటా ప్రకారం, తమకు రావాల్సిన కోటాలపై సంగ్రామం జరుగుతున్న సందర్భంలో బీసీ ఉద్యమానికి భావజాల ఆయుధాలు అందించే మహత్సర చారిత్రక బాధ్యతలను బీసీ కవులు, రచయితలు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. బీసీలను కవిత్వ ద్వారా చైతన్యం చేసే బాధ్యతను వనపట్ల సుబ్బయ్య తన ‘అసిపె’ దీర్ఘ కవితలో స్పష్టంంగా విశ్లేషించారని జూలూరు పేర్కొన్నారు.
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, నెల పొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్రభారతిలోని సమావేశం మందిరంలో రచయిత వనపట్ల సుబ్బయ్య రచించిన ‘అసిపె’ పుస్తకావిష్కరణ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యులు, పూర్వ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్నలు విచ్చేసి అసిపె పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోరెటి వెంకన్న మాట్లాడుతూ, కులం, మతం పేరిట సమాజాన్ని ధ్వంసం చేస్తుంటే కవి మౌనంగా ఉండరని పేర్కొన్నారు. కవిత్వం రాయడం మొదలుపెడితే ఆది జ్ఞాన జ్యోతియై వెలుగుతుందన్నారు. రచయిత వనపట్ల సుబ్బయ్య ప్రతిభా సంపన్నుడని, గొప్ప కళాకారుడని ఉప సంస్కృతి అసిపె పుస్తకంలో ఇమిడి ఉన్నదని ప్రశంసించారు. ఈ పుస్తకం చదివితే మంచి పరివర్తన వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కవి యాకూబ్, కోట్ల వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.