శేరిలింగంపల్లి, ఆగస్టు 9: కారు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో ఓ ఐటీ ఉద్యోగి మృతి చెందాడు. ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన కథనం ప్రకారం … చత్తీస్‌గఢ్ రాయపూర్ కు చెందిన రూపక్ త్రిపాఠి (30) మాదాపూర్‌లోని ఓ కంపెనీలో ఐటీ ఉద్యోగి. కేపీహెచ్బీలో తమ్ముడు శావత్ త్రిపాఠితో కలిసి నివాసం ఉంటున్నాడు.
స్నేహితులతో కలిసి శనివారం తెల్లవారు జామున ఎర్టిగా కారులో నాలెడ్జ్ సిటీకి వెళ్తుండగా టీ హబ్ రహదారిలో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టి నాలుగు పల్టీలు కొట్టింది. దీంతో బెలూన్లు తెరుచుకున్నప్పటికీ డ్రైవింగ్ చేస్తున్న రూపక్ త్రిపాఠి తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు మాదాపూర్‌లోని మెడికవర్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందాడు.
కారులో ఉన్న సోదరుడితో పాటు స్నేహితులు వైభవ్ పాటిల్, ఇషాంత్ త్రిపాఠి, ఎస్.రాజ్ సింగ్‌లు క్షేమంగా బయటపడ్డారు. ఐటీ ఉద్యోగం చేసిన రూపక్ త్రిపాఠి ఓ మొబైల్ యాప్‌ను డెవలప్ చేశాడు. యాప్‌ను లాంచ్ చేయాల్సింది అని చెప్పి చత్తీస్‌గఢ్ నుండి వారం రోజుల క్రితం ముగ్గురు స్నేహితులను పిలిపించు కున్నాడు. ఈ నెల 9న తెల్లవారు జామున ఐటీ కారిడార్‌ను చూసేందుకు వెళ్తూ కారు అదుపు తప్పడంతో రూపక్ త్రిపాఠి మృతి చెందగా, కారు ముందు చక్ర ఊడిపోయి నుజ్జునుజ్జయింది. పోలీసులు ఉస్మానియాకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.