సుల్తాన్‌బజార్, ఆగస్టు 13: దృష్టి మళ్లించి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర పిక్ పాకెటింగ్ మహిళా ముఠాను అఫ్జల్‌గంజ్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. మంగళవారం సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్‌జోన్ డీసీపీ డాక్టర్ బాలస్వామి, అడిషనల్ డీసీపీ నర్సయ్య, సుల్తాన్‌బజార్ ఏసీపీ శంకర్, ఇన్స్పెక్టర్ శ్రీనివాసాచారి, డీఐ మధుకుమార్ వివరాలను వెల్లడించారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన సబానా(22), కుంతి బాయి(32), రెహానా(35), రినో బాయి(35), మందాకిని సిసోడియా(35) ఒక ముఠాగా ఏర్పడ్డారు. సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకొని నగరానికి వచ్చి సికింద్రాబాద్‌లోని ఓ హోటల్లో ఉన్నారు. ప్రజల దృష్టి మళ్లించి దోపిడీలకు పాల్పడుతున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆవరణలో ఓ ఆటోను రూ.రెండు వేలకు బేరం కుదుర్చుకొని తిరుగుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న వ్యాపార సముదాయాలు, షాపింగ్ మాల్‌లోకి ఒకేసారి ఐదుగురు ప్రవేశించి.. అందులో ఇద్దరు కొనుగోలు చేస్తున్నట్టు నటిస్తూ మిగిలిన మగ్గురు అక్కడ ఉన్న వస్తువులను తస్కరిస్తారు. అదేవిధంగా.. రోల్డ్ గోల్డ్‌ను అసలు బంగారంగా నమ్మించి దోచుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. యూఎస్‌కు చెందిన ఎన్ఆర్ఐ మహిళ సుల్తాన్‌బజార్‌లోని ఓ వస్త్ర దుకాణంలో దుస్తులను కొనుగోలు చేసేందుకు వచ్చింది.
ఎన్ఆర్ఐ బ్యాగులోని పర్సును ఈ ముఠా సభ్యులు కొట్టేశారు. ఆ పర్సులో బాధితురాలి యూఎస్ఏకు చెందిన గ్రీన్ కార్డు, రూ.16 వేల నగదు, డీఎల్ క్రెడిట్ కార్డుతో పాటు ఇతర విలువైన పత్రాలు ఉన్నాయి. బాధితురాలు సుల్తాన్‌బజార్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న డీఐ మధుకుమార్, ఎస్ఐ నరేశ్ కుమార్, క్రైం సిబ్బందితో కలిసి సుమారు 220 సీసీటీవీ కెమెరాలను, సుల్తాన్‌బజార్ నుంచి సికింద్రాబాద్ వరకు 31 బస్టాండ్లను పరిశీలించగా.. ఒక ఆటోలో వచ్చిన ఐదుగురు మహిళల ముఠా దోపిడీకి పాల్పడినట్టు గుర్తించారు.
సీసీటీవీ కెమెరాల ఆధారంగా ఆటోను గుర్తించారు. ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా.. మహిళల ముఠా వివరాలు బయటపడ్డాయి. దీంతో ఆ అంతర్రాష్ట్ర మహిళా ముఠాను అరెస్టు చేసి విచారించగా.. నగరంలోని పలు ప్రాంతాల్లో దృష్టి మళ్లించి పిక్ పాకెటింగ్ నేరాలకు పాల్పడినట్లు అంగీకరించారు. పలు గోల్డ్ షాపుల్లో సేల్స్మన్లకు నకిలీ బంగారం చూపించి.. అసలు బంగారం దోచుకున్నట్టు తెలిపారు. ఈ గ్యాంగ్ వద్ద నుంచి రూ.2,000 నగదుతో పాటు 35 చీరలు, రోల్డ్‌గోల్డ్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఎంతో చాకచక్యంతో అంతర్రాష్ట్ర మహిళా ముఠాను అరెస్టు చేసిన సుల్తాన్‌బజార్ క్రైం సిబ్బందిని డీసీపీ, అదనపు డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు.