కవాడిగూడ, అక్టోబర్ 5: గత రెండు సంవత్సరాలుగా గాజాలో నరమేధాన్ని కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ తీరును వ్యతిరేకిస్తూ ఇండియన్ పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ పాలస్తీన్, బీడీఎస్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో పాలస్తీనాకు సంఘీభావంగా ఆదివారం ఇందిరాపార్కు వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.
దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమాలలో భాగంగా నిర్వహించిన ఈ నిరసన ప్రదర్శనలో పలువురు యాక్టివిస్టులు, మేధావులు, డాక్టర్లు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇజ్రాయెల్ తీరును ఖడిస్తూ పాలస్తీనాకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇండియన్ పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ పాలస్తీన్ యాక్టివిస్ట్ భార్గవి అధ్యక్షతన జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో ఇండియన్ పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ పాలస్తీన్ యాక్టివిస్ట్ ఆనందర్, బీడీఎస్ ఇండియా ప్రతినిధి శ్రీజ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ఇజ్రాయెల్‌తో అన్నిరకాల సంబంధాలను తెంచుకోవాని డిమాండ్ చేశారు.
ఇజ్రాయెల్ వలసవాదానికి వ్యతిరేకంగా పాలస్తీనా జాతీయ విముక్తికి మద్దతుగా జరుగుతున్న ఈ ఉద్యమాన్ని భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో దిశ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్, నవజవాన్ భారత్ సభ, ప్రోగ్రెసివ్ డాక్టర్స్ లీగ్ ప్రతనిధులతో పాటు పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య తదితరులు పాల్గొన్నారు.