Power Consumption | సిటీబ్యూరో, జనవరి 19 (నమస్తే తెలంగాణ):సాధారణంగా చలికాలంలో విద్యుత్ వినియోగం తగ్గుతుంటుంది. కానీ ఇందుకు భిన్నంగా ఈసారి గ్రేటర్లో చలి ఎక్కువగానే ఉన్నా విద్యుత్ వినియోగం మాత్రం పెరుగుతూ ఉన్నది. 2023లో గ్రేటర్ వ్యాప్తంగా 50 నుంచి 55 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ డిమాండ్ నమోదవగా.. గత రెండు నెలలుగా ప్రతిరోజూ 60-65 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ డిమాండ్ నమోదవుతున్నది. 2023లో గ్రేటర్ పరిధిలో విద్యుత్ వినియోగం వార్షిక సగటు డిమాండ్ 2917 మెగావాట్ల నుంచి 2024లో 3218 మెగావాట్లకు పెరిగింది. వృద్ధి కూడా 10.18 శాతంగా నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా గత డిసెంబర్ 19నుంచి రోజూ గరిష్ఠ స్థాయిలో 257 మిలియన్ యూనిట్ల వినియోగమవుతోంది.
2023లో ఇదే సమయానికి 217 మి.యూ.లే ఉన్నది. రోజూ ఏకంగా 40 మిలియన్ యూనిట్ల డిమాండ్ పెరగడంతో డిస్కంలు అప్రమత్తమయినట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్క గ్రేటర్లోనే గతం కంటే అదనంగా 200 మెగావాట్ల డిమాండ్ పెరిగింది. నగరంలో పారిశ్రామిక, గృహ వినియోగం వల్ల ఈ డిమాండ్ అధికమైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నగర పరిధిలో 2024 డిసెంబర్ నాటికి 62.92 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. 2023లో 60.26 లక్షలు ఉన్నాయి. సంవత్సర కాలంలో రెండు లక్షల కొత్త కనెక్షన్లు వచ్చాయి.
ఆ నాలుగు నెలలు కీలకం..
సాధారణంగా విద్యుత్ వినియోగం మార్చి నుంచి గణనీయంగా పెరుగుతున్నది. ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్, మే నెలల్లో గరిష్ఠ స్థాయిలో వాడకం నమోదవుతున్నది. అయితే 2024 మార్చిలో వినియోగం 24.52 శాతం పెరుగుదల కనిపించగా, ఏప్రిల్లో 19.66 శాతం, మేలో 13.46 శాతం, జూలైలో 12.91 శాతం పెరుగుదల నమోదైంది. జూన్లో మాత్రం వినియోగం తగ్గింది. గత అనుభవాల దృష్ట్యా ఈ ఏడాది వేసవికి డిస్కం కార్యాచరణ చేపట్టింది. గత రెండేళ్లలో 80 నుంచి 90 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదు కాగా.. ఈ సారి సెంచరీ దాటుతుందని అంచనా వేస్తున్నారు. గరిష్ఠ డిమాండ్ 5 వేల మెగావాట్లకు తగ్గట్లుగా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
జనవరి చివరి వరకు అందుకు తగినట్లుగా పనులు పూర్తి చేయాలని సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ అధికారులను ఆదేశించినా ఇంకా పనుల్లో వేగం పుంజుకోలేదు. సాంకేతిక కారణాల వల్ల ఫిబ్రవరి మొదటి వారం వరకు పనులు పూర్తిచేస్తామని అధికారులు చెప్పారు. మరోవైపు గ్రేటర్లో విద్యుత్ వినియోగం పెరగడానికి గృహజ్యోతి పథకం కూడా కారణంగా అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలోని 10 సర్కిళ్లలో 10.5 లక్షల మంది గృహజ్యోతి లబ్ధిదారులున్నారు. వారిలో గతంలో ప్రతినెలా 100 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే లక్షల మంది కనెక్షన్ దారులు గృహజ్యోతి అమలుతో ప్రతినెలా 140-160 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగిస్తున్నారు. మరికొన్నిచోట్ల 180 యూనిట్ల వరకు కరెంట్ వినియోగిస్తుండడంతో విద్యుత్ డిమాండ్ పెరిగింది. గ్రేటర్ పరిధిలోని పది సర్కిళ్లలో అత్యధికంగా సంగారెడ్డి సర్కిల్లో 2.13 లక్షల మంది, రాజేంద్రనగర్లో 1.33 లక్షలు, హబ్సిగూడ సర్కిల్లో 1.28 లక్షలు, మేడ్చల్ సర్కిల్లో 1.15 లక్షల మంది గృహజ్యోతి లబ్ధిదారులు ఉండగా.. వినియోగదారులు ఎక్కువగా ఉన్న సర్కిళ్లలో 2023 కంటే 2024లో 15-20శాతం విద్యుత్ డిమాండ్ పెరిగింది.