కవాడిగూడ, ఫిబ్రవరి 26: నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘హునర్ హాట్’కు అనూహ్య స్పం దన లభిస్తున్నది. పెద్ద ఎత్తున తరలివస్తున్న సందర్శకులు అక్కడ కొలువులు దీరిన కాశ్మీరీ శాలువాలు, భాగల్పూరి సిల్క్స్, లక్నో చికన్ కారీ, మధుబని, హైదరాబాదీ బిర్యా నీ, పుల్కారీ ఆర్ట్ దుస్తులు, అందమైన రాతి, చెక్క వస్తువులు, కార్పెట్లు, ఖాదీ వస్ర్తాలు, ఇత్తడి, రాగితో తయారు చేసిన వివిధ రకాల బొమ్మలను కొనుగోలు చేస్తున్నారు.
అలరిస్తున్న ర్యాంబో ఇంటర్నేషనల్ సర్కస్
ఒక వైపు డ్యాన్స్, గ్రూప్ ఆర్టిస్టులు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రజలను అలరిస్తుంటే, మరో వైపు అద్భుతమైన గాయనీ గాయకుల గానం హునార్ హాట్కు వచ్చే సందర్శకులకు మధురానుభూతిని కలిగిస్తున్నది. ర్యాంబో ఇంటర్నేషనల్ సర్కస్‌కు చెందిన 30 మంది కళాకారులు తమ అద్భుత విన్యాసాలతో ప్రజలను అలరిస్తున్నారు. పలువురు కళాకారులు చేసిన రింగ్ డ్యాన్స్, మ్యాజిక్ షో, మ్యూజిక్ డ్యాన్స్, జిమ్నాస్టిక్స్, జర్మనీ బీల్, క్యాండిల్ డ్యాన్స్, కామెడీ షో తదితర కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.