సిటీబ్యూరో, జనవరి 2 ( నమస్తే తెలంగాణ): ‘అవకాశాలు అనంతం.. శక్తి అపరిమితం.. జ్ఞానం అన్లిమిటెడ్.. ఆత్మహత్యల ఆలోచనలు తుడిచేసి.. అవకాశాల గనిని గుర్తించాలి. హీరోగా ఎదగడం కాదు.. హీరోలను తయారు చేసే వ్యక్తిగా ఉండాలి. ఉద్యోగిగా మిగలకూడదు.. ఉపాధినిచ్చే శక్తులుగా మారాలి … ఇదే స్ఫూర్తితో ఇంపాక్ట్ ఫౌండేషన్ లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులకు మార్గదర్శనం చేస్తున్నది. ఆదివారం లక్టీకపూల్లోని ఎఫ్‌టీసీసీఐలో ఇంపాక్ట్ ఫౌండేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పలు రంగాల నిష్ణాతులు తమ జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? వాటిని ఎలా పరిష్కరించుకున్నారు? ఆటంకాలను ఎలా తట్టుకున్నారు? ఓటమి వచ్చినప్పుడు మళ్లీ విజయం వైపునకు ఎలా దూసుకెళ్లారు? ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపడానికి వారు ఏం చేశారు? మొత్తంగా సక్సెస్ సొంతం చేసుకోవాలంటే సాధన ఎలా ఉండాలనే ప్రణాళికలు వివరించారు. వక్తలు అందరూ సభికుల్లో ఎంతో ప్రేరణ కలిగించారు. ఆద్యంతం సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది.
ఒక్క పూట తిని ఇనిస్టిట్యూట్‌కు వెళ్లేవాణ్ణి
నేను 20 ఏండ్ల క్రితం రూ.5వేలకు పనిచేసేవాణ్ణి. ఆ సమయంలో నాకు ఓ వ్యక్తి ఫోన్ చేసి మా కాలేజీలో లెక్చరర్‌గా చేయండి. నేను మీకు రూ. 35 వేలు ఇస్తాను అని ఆఫర్ ఇచ్చాడు. మరుసటి రోజు నేను చెప్పాను.. సర్.. ఆఫర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను జీతం తీసుకునే వ్యక్తిగా కాకుం డా జీతం ఇచ్చే వ్యక్తిలా ఉండాలనుకుంటున్నాను. అందుకోసం శ్రమిస్తానని చెప్పాను.ఇప్పుడు నేను నెలకు వందల మందికి లక్షల్లో జీతాలు ఇస్తున్నాను. నా తొలిరోజుల్లో డబ్బులు మిగుల్చుకోవడం కోసం ఒక్క పూట అన్నం తిని ఇనిస్టిట్యూట్‌కు వెళ్లేవాణ్ని. పట్టుదలతో చేస్తే ఏదైనా సాధించవచ్చు. – చిరంజీవి, ఫౌండర్, మేథా ఇనిస్టిట్యూట్
మనిషి మిషన్లా పనిచేయాలి
ఒక మనిషి మిషన్లా పనిచేయాలి. సమయపాలన మెయింటెన్ చేయాలి. నేను అలానే ఉండేదాన్ని. మనం చేసే పనిపై ఫోకస్ ఉండాలి. ఉన్నవాటి గురిం చి ఆలోచించకుండా లేని వాటి గురించి ఆలోచించడం మానుకోవాలి. పారుతున్న సెలయేరులా మన కార్యాచరణ ఉండాలి. ఎక్కడ ఆగిపోకూడదు. మనకు గుర్తింపు రావడం లేనది కుంగిపోవద్దు. ఏదో ఒక్క రోజు మాత్రం మీరు అనుకున్న లక్ష్యా న్ని చేరుతారు. నేను చాలా చిన్నవయసుల్లో డైరీ రాశా ను. ఈ వయసు వరకు ఏదైతే రాసుకున్నానో అవన్నీ నెరవేర్చుకున్నాను. మన జీవిత కథ చాలా మందికి ఆదర్శంగా నిలవాలి.
కష్టపడితే సక్సెస్ సొంతం
25 ఏండ్ల క్రితం నేను ఇంపాక్ట్ ప్రోగ్రామ్‌కు వచ్చాను. అప్పుడు ఫుడ్ కార్పొరేషన్లో చిన్న ఉద్యో గం చేసేవాణ్ణి. ఓ రోజు ‘నువ్వు మాస్టార్ ’అని గంప నాగేశ్వర్రావు నన్ను చూసి అన్నారు. నేను మాస్టర్ ఏంటని ఆలోచనలో పడ్డాను. ‘లేదు సర్ మీ స్పీచ్‌లు వినడానికి దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు’ అని నాలో ఓ ఆశ చిగురించేలా చేశాడు. మనం భయపడకుండా ఉన్న పరిస్థితులను మనకు అనుగుణంగా ఎలా మలుచుకోవాలో తెలుసుకోవాలి. మోటివేషన్ క్లాసెస్ ఒక వ్యక్తిపై చాలా ప్రభావం చూపుతాయి. అప్పటి వరకు ఉన్న మానసిక భయాలన్నీ తుడుచుపెట్టుకుపోతాయి. అందరూ తమలో ఉన్న శక్తిని నమ్ముకోవాలి. సక్సెస్ సొంతం అవుతుంది. – డాక్టర్ బీవీ పట్టాభిరామ్, సైకాలజిస్ట్
కాల్ చేస్తే చాలు ఉచిత శిక్షణ
మేము ఇంపాక్ట్ ప్రారంభించే సమయంలో నిరుద్యోగులకు స్కిల్స్ నేర్పించడానికి ఎటువంటి సంస్థలు లేవు. కొన్ని ఉన్నా శిక్షణ కోసం వేలల్లో డబ్బులు చార్జీ చేస్తున్నాయి. మరి అంత డబ్బు పెట్టలేని వాళ్ల పరిస్థితి ఏంటి? నేను కూడా పేద కుటుంబంలో పుట్టాను. ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తున్నాను. నాకు సెలవు దొరికనప్పుడల్లా ఉచితంగా స్కిల్స్‌పై అవగాహన కల్పించేవాణ్ణి. అలా మొదలైన మా ప్రయాణం నేడు లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్నాం. సమయపాలన, నాయకత్వ లక్షణాలు, ఒత్తిడి లేకుండా..మానవత్వ సంబంధాలు మెయింటెన్ చేయడంపై అనేక సూత్రాలను నేర్పిస్తాం. శిక్షణ తీసుకున్న చాలా మంది వాళ్లు ఎంచుకున్న రంగాలలో విజయవంతమయ్యారు. అనేక వ్యాపారాలు, ఐఏఎస్, ఐపీఎస్‌లు అయ్యారు. ఆరేండ్ల పిల్లల నుంచి అరవై ఏండ్ల వరకు కావాల్సిన అందరికీ నైపుణ్యంపై ఉచితంగా శిక్షణ ఇస్తాం. మాకు 9849000026 కాల్ చేస్తే చాలు మేము స్కిల్స్‌పై తరగతులు నిర్వహిస్తాం. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఆనందంగా జీవించేలా కృషి చేయడానికి అందరూ కలిసిరావాలి. మా వద్ద 17 వందల మంది ట్రైనర్స్ ఉన్నారు. వారంతా ఉచితంగా మోటివేషన్ చేస్తున్నారు. అనేక వ్యాపార, ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నాం.