కుత్బుల్లాపూర్, ఆగస్టు 15 ; పిల్లలు లేని దంపతుల మనోవేదన.. పేదరికంతో బాధపడే కొందరు మహిళల అవసరాలను ఆసరాగా చేసుకొని ఓ ముఠా అంగట్లో అక్రమ అద్దె గర్భం దందాకు తెరలేపింది. లక్షలు వసూలు చేయడమే కాదు.. అద్దె గర్భం కోసం వచ్చిన వారికి షెల్టర్‌ను ఏర్పాటు చేసి.. వ్యవహారాన్ని నడిపిస్తున్నది. చింతల్లో ఈ అక్రమ సరోగసీ కేంద్రం వ్యవహరం బట్టబయలైంది. ఇద్దరు నిందితులతో పాటు మరో ఆరుగురు సరోగసి మహిళలను అరెస్టు చేశారు. మేడ్చల్ జోన్ డీసీపీ కోటిరెడ్డి, మేడ్చల్ జిల్లా వైధ్యాధికారిణి ఉమాగౌరీ శుక్రవారం పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఏపీ చిలకలూరిపేటకు చెందిన నరేద్దుల లక్ష్మీరెడ్డి(45) అతడి కొడుకు నరేందర్‌రెడ్డి(27) కుత్బుల్లాపూర్ చింతల్ ప్రాంతంలోని పద్మానగర్ ఫేస్-2 రింగ్ సమీపంలో ఉన్న సాయిబాబానగర్‌లో నివాసం ఉంటున్నారు. లక్ష్మీరెడ్డి మహారాష్ట్రలో మానవ అక్రమ రవాణా కేసులో నిందితురాలు.
పైగా గతంలో అండం దాతగా, అద్దె తల్లిగా పని చేసింది. దీంతో అక్రమ మార్గంలో అధిక డబ్బులు సంపాందించాలనే ఆశతో తానే రంగంలోకి దిగింది. పలు ఆసుపత్రి కేంద్రాలకు వచ్చే పిల్లలు లేని దంపతుల సమాచారంతో పాటు పేదరికంతో బాధపడుతున్న మహిళల వివరాలను తీసుకుంది. బీదర్ జిల్లా బస్వకల్యాణ్ మండలం కానాపూర్‌కు చెందిన గోల్కొండ సాయిలీల(39), ఏపీ అల్లూరి సీతారామారాజు జిల్లా రంపచౌడవరం మండలంలోని చిన్నబీరంపల్లి గ్రామానికి చెందిన మాలగల్ల వెంకటలక్ష్మి (30), సదల సత్యవతి(29) ఇదే మండలంలోని పీరుకొండ గ్రామానికి చెందిన పి. సునీత(29), విజయనగరం జిల్లా పెందురితి మండలంలోని వేపకుంట గ్రామానికి చెందిన పంటాడ అపర్ణ(30), అదే జిల్లా పోస్పేట మండల కేంద్రానికి చెందిన జె. రమణమ్మ(39) అవసరాలను ఆసరాగా చేసుకొని తక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చింది. అద్దె గర్భం కోసం చింతల్‌లోని తన నివాసంలో ఉంచుకొని..మాదాపూర్‌లోని ఎగ్డే సంతానోత్పత్తి ఆసుపత్రి, లక్స్ ఆసుపత్రిల నుంచి సంతానోత్పత్తి కోసం తీసుకెళ్లేంది. విశ్వసనీయ సమాచారం మేరకు మేడ్చల్ ఎస్ఓటీ, పేట్ బషీరాబాద్ పోలీసులు చేసిన దాడుల్లో ఈ అక్రమ సరోగసి కేంద్రం వ్యవహరం వెలుగులోకి వచ్చింది. నిందితురాలి ఇంట్లో రూ. 6 లక్షల 47 వేల నగదు, ల్యాప్‌టాప్, ప్రామిసరీ నోట్స్, నాన్-జ్యుడిషియల్ బాండ్ పేపర్లు, పెద్ద మొత్తంలో సిరంజీలు, గర్భధారణ మందులు, ఆయా ఆసుపత్రుల కేస్షఈట్లు, ఐదు స్మార్ట్ ఫోన్లు సీజ్ లభించాయి. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు.
జనావాసాల మధ్య అక్రమ సరోగసి సెంటర్..
నిందితురాలు లక్ష్మీరెడ్డి మహారాష్ట్రలో మానవ అక్రమ రవాణా కేసు ఇంకా ఉంది. ఈ క్రమంలో తన కొడుకు నరేందర్‌రెడ్డి జేఎన్టీయూలో కెమికల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తి చేయడంతో చేయగా, ఈ రాకెట్ దందాను గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తున్నారు. చింతల్‌లోని పద్మానగర్ ఫేజ్-2 రింగ్ రోడ్డు సమీపంలో సాయిబాబానగర్(న్యూమాణిక్యనగర్) ప్రాంతంలో ఓ ఇంటిని కొనుగోలు చేసి ఎవరికీ అనుమానం రాకుండా జనావాసాల మధ్యే అక్రమంగా సరోగసి సెంటర్‌ను నడిపిస్తున్నది. తాను ఉండే ఇంట్లోనే ఆరుగురు మహిళలకు నిత్యం ప్రోటిన్లతో కూడిన ఆహారం, ఇచ్చే మందులు లభించాయి. అదే భవనంలో బ్యాచ్‌లర్స్‌కు, ఇతరులకు అద్దెకు ఇచ్చి.. మిగతా పోర్షన్లో ఆరుగురి మహిళలకు సంబంధించిన దినచర్య బాగోగులు జరుగుతున్నాయి. దీంతో ఎలాంటి అనుమానాలు రాకుండా జనవాసాల మధ్యే యథేచ్ఛగా వ్యాపారాన్ని కొనసాగించడం గమనార్హం.