ఖైరతాబాద్, మార్చి 14: పోలీసుల నిషేధాజ్ఞలు అమలవుతున్న సమయంలో ఓ ముఠా దొంగచాటుగా మద్యాన్ని విక్రయించింది. పూలు, పండ్ల వ్యాపారం మాటున పండుగ వేళ మందును సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కింది. ఖైరతాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నది. సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం… హోలీ పండుగ నేపథ్యంలో పోలీసు శాఖ శుక్రవారం ఉదయం 6 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులను మూసివేస్తూ నిషేధాజ్ఞలు విధించింది.
ఈ క్రమంలో ఖైరతాబాద్‌లోని రైల్వే గేటు సమీపంలో మార్కెట్ రోడ్డులో ముగ్గురు మహిళలు పూలు, పండ్ల విక్రయాల ముసుగులో అవసరమైన వారికి బీర్లు, విస్కీ బాటిళ్లు చాటు మాటున అధిక ధరలకు విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేయగా, ఓ గదిలో పెద్ద ఎత్తున నిల్వలను గుర్తించారు. సుమారు 27.17 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకొని విక్రయదారులైన సి. చిన్ని, ఎ. చాందిని, జీజీ బాయిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.