సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : అక్రమ లీజుదారులు జీహెచ్ఎంసీ ఆస్తులను దర్జాగా అనుభవిస్తున్నారు. ఏళ్ల తరబడి లీజు గడువు ముగిసిన వాటిని స్వాధీనం చేసుకోవడంలో ఎస్టేట్ విభాగం నిర్లక్ష్యం చేస్తున్నది. గజం స్థలానికి ఒక్క రూపాయి మాత్రమే అద్దె చెల్లిస్తున్న లీజు ఒప్పందాలు కూడా నేటికీ యథాతథంగా కొనసాగుతున్నాయి. అజాద్(మోతి) మార్కెట్ లీజుల గడువు… ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.
ఏటా కోట్ల రూపాయల మేర జీహెచ్ఎంసీ ఖజానాకు గండిపడుతున్నా ఎస్టేట్ విభాగం అధికారుల్లో చలనం కరువైంది. వాస్తవంగా లీజు పూర్తయ్యాక అధికారులు ఆయా దుకాణాలను ఖాళీ చేయించాలి. మళ్లీ టెండర్ వేలం వేసి ప్రక్రియను కొనసాగించాలి. ఏడాదికొకసారి అద్దె విలువ 5 శాతం మేర పెంచాలి. కానీ ఘనత వహించిన ఎస్టేట్ విభాగం నోటీసులతోనే సరిపెడుతున్నది. ఇటీవల కాలంలో 14 యూనియన్ కార్యాలయాలతో పాటు 2300 షాపుల లీజుదారులకు నోటీసులు ఇచ్చారే కానీ ఇప్పటి వరకు పురోగతి సాధించలేదు.
ఈ నేపథ్యంలోనే ఎస్టేట్ విభాగం అధికారులపై పనితీరుపై కమిషనర్ ఇలంబర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసి ఆస్తులు ఎకడెకడ ఉన్నాయో క్షేత్ర స్థాయి అధికారులు తెలుసా? అని కమిషనర్ ప్రశ్నించారు. అదే విధంగా కమ్యూనిటీ హాల్స్ ఎకడెకడ ఉన్నాయో, ఎవరి ఆధీనంలో ఉన్నాయో పరిశీలన చేసి నివేదిక సమర్పించాలన్నారు. వీటిని కూడా కంప్యూటరైజ్ చేసి లోకేషన్ కూడా పొందుపర్చాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. కమ్యూనిటీ హాల్స్ ఎవరి ఆధీనంలో ఉన్నాయో? ఎవరు వినియోగిస్తున్నారో వంటి వివరాలను సేకరించి అందజేయాలని కమిషనర్ అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రార్ ఏర్పాటు చేసి కంప్యూటరీకరించాలని అధికారులను ఇలంబర్తి ఆదేశించారు. ఆస్తులకు సంబంధించిన లీజు పూర్తయినా ఇంకా కొనసాగుతున్నట్లు వివరాలను సేకరించి వారందరికీ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. లీజుకు తీసుకున్న వ్యక్తి వినియోగించుకుంటున్నారా లేదా ఇతరులు ఉపయోగించుకుంటున్నారా అని క్షేత్ర స్థాయిలో జోనల్ అసిస్టెంట్ ఎస్టేట్ అధికారులు విచారించి నివేదిక అందజేయాలన్నారు. ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రార్ తప్పని సరిగా ఉండాలని, ఆస్తులు కంప్యూటరైజ్ చేసి అందులో పూర్తి వివరాలు ఉండాలని లీజు ఎప్పటి వరకు ఉంది? ఎప్పుడు పూర్తవుతుంది? వంటి వివరాలు పూర్తి సమాచారం ఉండాలని కమిషనర్ పేర్కొన్నారు.
ఆస్తులు కంప్యూటర్లోనే ప్రజలకు పూర్తి వివరాలు తెలియాలని అధికారులను ఆదేశించారు. లీజు మారెట్ రేటు ప్రకారంగా కేటాయింపు జరగాలని, లీజు పూర్తయిన ఇంకా కొనసాగుతున్న వివరాలను పూర్తి నివేదిక అందజేయాలన్నారు. అంతేకాకుండా కంప్యూటర్ చేసేందుకు అవసరమైన ప్రత్యేకమైన డెవలపర్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఐటీ ఆధికారులను ఆదేశించారు. అద్దె చెల్లింపు కూడా ఆన్ లైన్ ద్వారా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఒకొక ఆస్తికి ఒక ఐడి కేటాయించాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కమీషనర్ సి. చంద్రకాంత్ రెడ్డి, యుసిడీ ప్రాజెక్టు డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్ పి.సురేష్ కుమార్, 30 సరిళ్ల ప్రాజెక్ట్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.