సిటీబ్యూరో, మే 3(నమస్తే తెలంగాణ) : పండ్లు, కూరగాయల సాగు, మార్కెటింగ్ అంశాల్లో ఒడిశా రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా ఇక్రిశాట్ రూపొందించిన ప్రణాళికలను అమలు చేయనుంది. ఒడిశాలో సరఫరా గొలుసు నిర్వహణ ద్వారా రైతులకు సాధికారత కల్పించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం కాగా.. ఇరు సంస్థల మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఈ మేరకు ఒడిశా స్టేట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ బోర్డు, ఇక్రిశాట్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఆ రాష్ట్రంలో వ్యవసాయ సాగు, నిర్వహణ విధానాలను ఆధునీకరించడమే ప్రధాన లక్ష్యం.
రాష్ట్రంలోని మొత్తం 66 రెగ్యులేటెడ్ మారెట్ కమిటీలు, 43 రైతు బజార్లు, 800 రేషన్ దుకాణాలు, మహిళా సంఘాలతో నడిచే 76 మున్సిపల్ మారెట్లను సమన్వయం చేస్తూ అగ్రి మారెటింగ్ నెట్వర్ను ఒడిశా వ్యవసాయ శాఖ రూపొందించింది. ఈ క్రమంలో తాజా ప్రాజెక్టును ఈ నెట్ వర్క్‌కు అనుసంధానం చేస్తూ పండ్లు, కూరగాయల సాగు-మార్కెటింగ్ రంగాలను విస్తరించనున్నది. చిన్న, సన్నకారు రైతుల ఆర్థిక పురోగతికి ఈ ఒప్పందం తోడ్పాటునందించనుంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా వ్యవసాయ సరఫరా గొలుసులో మధ్యవర్తుల పాత్రను కట్టడి చేస్తుందని భావిస్తున్నారు.
ఇక్రిశాట్ అనుబంధంగా మార్కెటింగ్, పంటల సాగుపై ఆధునీకరించేందుకు అగ్రి బిజినెస్ ఇంక్యుబేటర్ సంస్థతో ఒడిశా వ్యవసాయ శాఖ ఒప్పందం చేసుకున్నది. పండ్లు, కూరగాయల రంగంలో అనేక సవాళ్లను ఆ రాష్ట్రం ఎదుర్కొంటుంది. సాగు చేసే రైతుల నుంచి కొనుగోలు చేసే వినియోగదారుల వరకు ఆ సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో పంటల దిగుబడి, నాణ్యత తగ్గిపోతుంది. దీంతో పంట ఉత్పత్తుల నాణ్యత, సాగులో వైవిధ్యం, నిర్మాణాత్మక, శాస్త్రీయ ప్రాసెసింగ్ వ్యవస్థల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులను ఈ ఒప్పందం ద్వారా ఇక్రిశాట్ సమకూర్చనుంది. దీంతో మధ్యవర్తులకు వ్యాపార అవకాశాలు తగ్గిపోవడమే కాకుండా పంట ఉత్పత్తుల్లో నాణ్యత కూడా పెరుగుతుందని ఇక్రిశాట్ వర్గాలు చెబుతున్నాయి.