అంబర్‌పేట, నవంబర్ 13 : బాగ్‌అంబర్‌పేట డివిజన్ పాములబస్తీలో ఉన్న పురాతన బొందలగడ్డను పరిశుభ్రం చేసి అందులో స్థానికుల కోరిక మేరకు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గత 40 ఏండ్ల క్రితం నాటి సమాధులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా స్థానికులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం పాములబస్తీ, మందులబస్తీ, అంబేద్కర్‌నగర్, శ్రీనివాసనగర్ తదితర చుట్టు పక్కల ప్రజలంతా కలిసి పాములబస్తీ స్థలం వద్ద సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో ఆయా బస్తీల ప్రజలు పాల్గొని కొన్నేండ్ల కిందట ఉన్న ఈ బొందలగడ్డ ప్రస్తుతం డంపింగ్ యార్డుగా మారిందని, చెత్తాచెదారం, వ్యర్థాలు చేరడంతో కంపు కొడుతుందన్నారు. ఎలుకలు, పందికొక్కులు తిరగడమే కాకుండా రాత్రిపూట కుక్కలు గుంపులుగా చేరి నిద్రలేకుండా చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎవరు కూడా ఇక్కడ బొందలు పెట్టడం లేదని, స్థలం ఖాళీగా ఉండడంతో అసాంఘిక శక్తులు ఇక్కడ చేరి గందరగోళం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. వారి బాధ నుండి తప్పించుకునేందుకే తామంతా దీన్ని అభివృద్ధి పరచాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే పార్కును శుభ్రం చేయించడమే కాకుండా చుట్టు కాంపౌండ్ వాల్, లోపల బాక్స్ డ్రెయిన్‌ను కట్టిస్తానని తెలిపారని అన్నారు.
ఈ పనులు మొదలుకాగానే కొందరు వ్యక్తులు వచ్చి తమ కులస్తుల బొందలు ఉన్నాయని, బొందలను తొలగించారని ఆరోపిస్తూ పనులు అడ్డుకున్నారని చెప్పారు. అయితే ఇక్కడ ఎలాంటి కబ్జాలు కానీ, బొందలను తొలగించడం కానీ జరగలేదని తెలిపారు. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాములబస్తీ, మందులబస్తీ, నందరాజ్నగర్ తదితర బస్తీల ప్రజలంతా తన వద్దకు వచ్చి వారు నిత్యం పడుతున్న బాధులు చెప్పడంతో తాను పచ్చదనం ఏర్పాటు చేసి, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నానని వెల్లడించారు. పనులు మొదలు కాగానే కొందరు వచ్చి రాజకీయం చేస్తున్నారన్నారు.
ఎవరి బొందలను తొలగించలేదని, ఎవరూ కబ్జా చేయ డం లేదని పేర్కొన్నారు. స్థానిక ప్రజల కోరిక మేరకు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బస్తీవాసులు రా వుల సుధాకర్, కనివేట నర్సింగ్‌రావు, కేబుల్ రా జు, శకుంతల, శ్రీనివాస్, నిరంజన్, మైసయ్య, సుందరమ్మ, ఆర్. బాలరాజు, బంగారు శ్రీను, పద్మావతి, మహేశ్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్, పాష, డా.బాలనరసింహ, లింగమయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్లోని నందనవనం కాలనీ ఆధ్వర్యంలో ఆదివారం మధుమేహం, గుండె, ఛాతి వ్యాధులపై ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంచి ఆహారం తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చని అన్నారు. వైద్య శిబిరం ఏర్పాటు చేసిన డాక్టర్లను అభినందించారు.
ఇలాంటి వైద్య శిబిరాలను అంబర్‌పేట నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఏర్పాటు చేయాలని, అందుకు కావాల్సిన పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. డాక్టర్ దత్తారెడ్డి ఆకిటి, డా. అశ్వి న్ తూముకూర్, డాక్టర్ విశాల్‌కుమార్ శిబిరానికి వచ్చిన రోగులకు ఉచితంగా పరీక్షలు చేశారు. మధుమేహం, థైరాయిడ్, రక్తపోటు, ఉబ్బసం వ్యాధులకు సబంధించి పరీక్షలు చేశారు. అవసరమైన వారికి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నందనవనం కాలనీ ప్రతినిధులు పంజాల చంద్రశేఖర్, ప్రదీప్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.