మియాపూర్, నవంబర్ 18 : ఐటీ పరిశ్రమలకు నెలవుగా ఉన్న శేరిలింగంపల్లి జోన్లో ట్రాఫిక్ కష్టాలకు చెల్లు పాడేలా ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతతో ముందుకు సాగుతున్నది. ఇప్పటికే ఐటీ జోన్లో పలు ఫ్లై ఓవర్లను అందుబాటులోకి తీసుకువచ్చి వాహనదారులకు సింహభాగం ట్రాఫిక్ సమస్య లేకుండా చేసిన ప్రభుత్వం తాజాగా.. శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్‌ను కొద్ది రోజులలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నది శిల్ప లేఅవుట్ నుంచి ఓఆర్ఆర్ వరకు సుమారు 900 మీటర్ల మేర ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఈ నెల చివర్లో ఈ ఫ్లై ఓవర్ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రధానంగా ఈ ఫ్లై ఓవర్‌తో ఓఆర్ఆర్ నుంచి కేబుల్ వంతెన మీదుగా.. అక్కడి నుంచి నేరుగా మరో ఫై ఓవర్ ద్వారా జూబ్లిహిల్స్లోకి సిగ్నళ్లు లేకుండా ప్రయాణించే వెసులుబాటు వాహదారులకు కలగనున్నది. ఇప్పటి వరకు అత్యంత రద్దీగా ఉండే మూడు కీలకమైన సిగ్నళ్లను దాటుకుని కేబుల్ వంతెన వైపునకు వాహనాలు ప్రయాణిస్తుండగా.. శిల్ప ఫ్లై ఓవర్‌తో ఆ కష్టాలకు చెక్ పడనున్నది. తద్వారా నూతన ఫ్లై ఓవర్ నుంచి వచ్చే వేలాది వాహనాలతో పాటు కేబుల్ వంతెన, ఇనార్బిట్‌మాల్, సీ గేట్ తదితర ప్రాంతాల నుంచి కొండాపూర్ రోడ్‌కు చేరుకునే వాహనాలు ఎటువంటి ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రయాణించగలుగుతాయి. అయితే రహదారి విస్తరణకు జీహెచ్ఎంసీ సైతం సిద్ధంగా ఉండగా.. పనులను వేగంగా పూర్తి చేయాలన్నది ట్రాఫిక్ విభాగం అధికారుల అభ్యర్థన.
శిల్పా ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ఈ నెలాఖరులోగా అందుబాటులోకి రానున్న నేపథ్యంలో.. పరిసర ప్రాంతాలలో వాహనాల రాకపోకలు, రహదారి విస్తరణ, అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాల మార్పు, గ్రీనరీ, పారిశుధ్యం సహా ఇతర పనుల నిర్వహణపై జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళికా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఆయా విభాగాలు సంయుక్తంగా మూడు దఫాలుగా ఫ్లై ఓవర్ దిగగానే ఎడమవైపు వాహనాల ప్రయాణం డెలాయిట్ ఎదుట యూ టర్న్, సమీపంలో సిగ్నల్ మూసివేత, యూటర్న్ ప్రాంతంలో రహదారి విస్తరణ, ఐకియా నుంచి డ్లైట్ వరకు రెండు లేన్లుగా ఉన్న దారిని నాలుగు లేన్లుగా విస్తరణ సహా పలు అంశాలను జడ్సీ శంకరయ్య ట్రాఫిక్ విభాగం డీసీపీ శ్రీనివాసరావుతో పాటు ఇతర అధికారులు పరిశీలించారు. రహదారి విస్తరణ పనులను వేగంగా పూర్తి చేసేలా చూడాలని జిహెచ్ఎంసీసీ ట్రాఫిక్ అధికారులు కోరారు. అధికారులు సైతం అందుకు సంబంధించిన పనులపై ఇప్పటికే దృష్టి సారించారు. ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చి.. ఓ ఆర్ఆర్ నుంచి వచ్చే వేలాది వాహనాలతో పాటు కేబుల్ బ్రిడ్జి వైపు నుంచి, ఐకియా వైపు నుంచి వేలాది వాహనాలుసాఫీగా ఏఐజీ మీదుగా కొండాపూర్, కేబుబ్ బ్రిడ్జి వైపు వెళ్లాలంటే డిలైట్ సమీపంలో రహదారి విస్తరణే అత్యంత ప్రధానం.
శిల్ప లే అవుట్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావటం ద్వారా రద్దీగా ఉండే సిగ్నళ్లను దాటుకుని వాహనదారులు సులువుగా కేబుల్ వంతెన వరకు ప్రయాణించవచ్చు. ఓఆర్ఆర్ నుంచి శిల్ప లే అవుట్లో దిగే వాహనాలు సమీపంలోని వన్ వే రోడ్డు ద్వారా డిలైట్ వైపు అక్కడ యూ టర్న్ తీసుకుని ఐకియా ఫ్లై ఓవర్ మీదుగా నేరుగా కేబుల్ బ్రిడ్జి వద్దకు చేరుకోవచ్చు. ఆ వంతెనను దాటుకుని సమీపంలోని మరో వంతెన ద్వారా నేరుగా జూబ్లిహిల్స్ వైపు సిగ్నళ్లతో పని లేకుండా వెళ్లిపోవచ్చు. ఈ ఫ్లై ఓవర్ ద్వారా కొత్తగా ఓఆర్ఆర్ నుంచి వేల సంఖ్యలో వాహనాలు శిల్ప లే అవుట్‌కు ప్రయాణించే అవకాశం ఉన్నందున డిలైట్ సమీపంలో రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించాలని మా ఉన్నతాధికారులు జీహెచ్ఎంసీ అధికారులను కోరారు. తద్వారా కేబుల్ వంతెన వైపు నుంచి ఓఆర్ఆర్ నుంచి ఇక్కడి వచ్చే వాహనారులు రహదారి విస్తరణతో సులువుగా ట్రాఫిక్ సమస్య లేకుండా ముందుకు సాగుతాయి.
– శ్రీనాథ్, సీఐ రాయదుర్గం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్