సిటీబ్యూరో, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ నగరంలో కేబీఆర్ పార్కు కింద సొరంగ మార్గం (రోడ్ టన్నెల్)పై అధ్యయనం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తున్నది. ఫిజిబులిటీ స్టడీ, డీపీఆర్ రూపకల్పనలో భాగంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో ఫిజిబులిటీ స్టడీ, డీపీఆర్‌ల తయారీకి పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులతో పాటు జీహెచ్ఎంసీ ఈఎన్సీ మహ్మద్ జియావుద్దీన్, స్పెషల్ సెక్రటరీ ఆర్.శ్రీధర్, సూపరింటెండింగ్ ఇంజినీర్ ఎస్.వెంకటరమణ తదితరులు ఢిల్లీలోని రెండు టన్నెన్లను ఇటీవల పరిశీలించారు.
ప్రగతి మైదాన్ వద్ద 1.30 కిలోమీటర్ల మేర సొరంగమార్గం, ఆనంద్ విహార్ దగ్గర సొరంగమార్గం నిర్మాణ పనులపై అధ్యయనం చేసిన కమిటీ నగరంలో చేపడుతున్న అండర్‌పాస్‌ల వంటివేనని తేల్చారు. అయితే కేబీఆర్ పార్కు నేల స్వభావం, పార్కు ప్రాంతం, సాంకేతికపరంగా నిర్మాణం సాధ్యం కాదని అధ్యయన కమిటీ ప్రాథమికంగా తేల్చినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని త్వరలో నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. గతంలో కేబీఆర్ పార్కు చుట్టూ వంతెనల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించగా, పార్కులో జీవ వైవిధ్యం దెబ్బ తినడంతో పాటు వేలాది చెట్లు తొలగించాల్సి వస్తుందని జాతీయ హరిత ట్రిబ్యునల్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై జీహెచ్ఎంసీ దృష్టి సారించి సొరంగ మార్గంపై అడుగులు వేసింది. ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్ రోడ్ నం 45 నుంచి కేబీఆర్ పార్కు ప్రవేశ ద్వారం వరకు 1.70 కిలోమీటర్లు, కేబీఆర్ ప్రధాన ద్వారం నుంచి ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వరకు 2 కిలోమీటర్లు, బంజారాహిల్స్ రోడ్ నం.12 టన్నెల్ జాయినింగ్ పాయింట్ 1.10 కి.మీ, అప్రోచ్ రోడ్లు 1.50 కిలోమీటర్లు కలిపి మొత్తం 6.30 కిలోమీటర్ల మేర సొరంగం నిర్మించాలని భావించారు. నాలుగు వరుసలుగా చేపట్టబోయే ఈ నిర్మాణానికి రూ.5 కోట్ల మేర వ్యయం అవుతుందని జీహెచ్ఎంసీ అంచనా వేసింది. పార్కుపై ప్రభావం పడకుండా 100 అడుగుల లోతున ఈ సొరంగ మార్గం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే అధ్యయన కమిటీ ఇచ్చే నివేదిక కీలకంగా మారనున్నది.