సిటీబ్యూరో, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ)/ జూబ్లీహిల్స్: పాదచారుల భద్రతకు జీహెచ్ఎంసీ పెద్ద పీట వేస్తున్నది. రద్దీ మార్గాల్లో సులువుగా రోడ్డు దాటేలా జీహెచ్ఎంసీ ఫుట్ ఓవర్ బ్రిడ్జి(ఎఫ్వోబీ)లను చేపడుతున్నది. ప్రధాన కూడళ్ల వద్ద వాహనాల రద్దీ ఎకువగా ఉండటంతో ప్రయాణికులు రోడ్డు దాటేందుకు ఇబ్బంది పడటంతో పాటుగా తరుచుగా ప్రమాదాల బారిన పడుతున్నారు. దానిని అధిగమించేందుకు ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. రూ.76.65 కోట్ల వ్యయంతో 22 చోట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టగా ఇందులో ఇప్పటికే రూ.23.10కోట్లతో ఏడు చోట్ల ఎఫ్‌వోబీలను అందుబాటులోకి తీసుకువచ్చారు. తాజాగా ఎర్రగడ్డ ఈఎస్ఐ ఎదురుగా రూ.5 కోట్ల అంచనాతో చేపట్టిన ఎఫ్వోబీని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సోమవారం ప్రారంభించనున్నారు.
ట్రాఫిక్ రద్దీ ఎకువగా ఉన్నందున ఎఫ్వోబీతో పాదచారులకు ఎంతో మేలు కలుగుతుంది. జాతీయ రహదారి 65 దాటి వాణిజ్య సముదాయాలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు, సనత్ నగర్, ఎర్రగడ్డ వార్డులో నివసించే వారికి, ఈఎస్ఐ హాస్పిటల్ వెళ్లేందుకు, ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్, రైతు బజార్‌కు వెళ్లేందుకు సులభతరం అవుతుంది. శేరిలింగంపల్లి జోన్ ఎర్రగడ్డ వార్డు 19 పరిధిలో రూ.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి 34.30 మీటర్లు స్పాన్ వాక్ వే, 5.80 మీటర్ల వర్టికల్ క్లియరెన్స్, 3 మీటర్ల వాక్ వే వెడల్పు, 30 మీటర్ల కాజ్ వే వెడల్పు రోడ్డు, 2035 నాటికి 4300 మంది పాదచారులు ప్రయోజనం పొందే అవకాశం ఉంది.
రూ.23.10 కోట్ల అంచనాతో ఏడు చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్వోబీ)లను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. చెన్నై షాపింగ్ మాల్, మదీనాగూడ, మియాపూర్ యశోధ పెరల్ కాంప్లెక్స్, పంజాగుట్ట హైదరాబాద్ సెంట్రల్ మాల్, బాలానగర్ ఎన్‌ఎస్‌కేకే స్కూల్ దగ్గర, నేరేడ్మెట్ బస్టాప్, సికింద్రాబాద్ సెయింట్ అనన్ స్కూల్, రాజేంద్రనగర్ స్వప్న థియేటర్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
యూసుఫ్‌గూడ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పాదచారుల వంతెనను అత్యంత నాణ్యతా ప్రమాణాలతో మధ్యలో ఎలాంటి పిల్లర్లు లేకుండా నిర్మాణం చేపట్టారు. గతంలో ఏర్పాటుచేసిన ఎఫ్వోబీలకు భిన్నంగా తొలిసారి మెట్రో తరహాలో లిఫ్ట్, ఎస్కలేటర్ల సౌకర్యం కల్పిస్తున్నారు. ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటుచేసిన ఈ పాదచారుల వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. సుమారు రూ.5 కోట్ల వ్యయంతో యూసుఫ్‌గూడ జీహెచ్ఎంసీ సర్కిల్ అధికారులు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు.
ఈఎస్ఐ దవాఖాన సమీపంలో ఏర్పాటుచేసిన ఎఫ్‌వోబీకి 2 లిఫ్టులు, 2 ఎస్కలేటర్ల సౌకర్యం కల్పిస్తున్నాం. దవాఖానకు వచ్చే రోగులతో పాటు సీనియర్ సిటిజన్స్, వికలాంగులు వీటిని ఉపయోగించుకోవచ్చు. ఈ మేరకు లిఫ్టులు ఏర్పాటుచేసే పనులు పూర్తయ్యాయి. అందరికీ సౌకర్యవంతంగా ఉండేందుకు ఏర్పాటుచేసిన ఎస్కలేటర్ పనులు సైతం పూర్తయ్యాయి. ఈ వంతెనను సోమవారం నుంచి అందుబాటులోకి తేనున్నాం.
– రాజ్ కుమార్, ఈఈ , యూసుఫ్‌గూడ, సర్కిల్-19 .