సికింద్రాబాద్, నవంబర్ 13: నగరంలో నగదు రహిత లావాదేవీలు నానాటికీ పెరిగిపోతున్నాయి. చిన్న సూది నుంచి రూ. లక్షల విలువ చేసే వస్తువు వరకు అంతా యూపీఐ ద్వారా క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. నగదు రహిత లావాదేవీల్లో భాగంగా ప్రతిఒక్కరూ ఆన్లైన్ వైపే మొగ్గు చూపుతున్నారు. దాంతో వ్యాపారులు సైతం వివిధ రకాల కంపెనీలకు చెందిన స్కానర్లు ఏర్పాటు చేస్తున్నారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆయా సంస్థలు సైతం నగదు రహిత లావాదేవీలకే ‘జై’ కొడుతున్నాయి.
నగరంలోని సికింద్రాబాద్, కంటోన్మెంట్ తదితర ప్రాంతాల్లోనే యూపీఐ చెల్లింపుల ద్వారా రూ.కోట్లలో వ్యాపారం జరుగుతుందంటే ఆన్లైన్ చెల్లింపులు ఏస్థాయిలో జరుగుతున్నాయో చెప్పవచ్చు. జంట నగరాల్లో ట్రెండ్ మారింది. ఎక్కడైనా.. ఏ ప్రాంతమైనా, బస్సు, ఆటో చార్జీలు, క్యాబ్‌లు, టీ నుంచి ఎల్సీడీ టీవీల వరకు అంతా నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. మారుతున్న కాలానుగుణంగా నగర ప్రజలు ‘స్మార్ట్’ విధానాన్ని అనుసరిస్తున్నారు.
మెట్రో నగరమైన హైదరాబాద్‌లో యూపీఐ చెల్లింపులు జోరందుకున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ ఫోన్ పే, జీ పే, పేటీఎం లాంటి యాప్‌ల సాయంతో లావాదేవీలు జరుపుతున్నారు. తమ వ్యక్తిగత బ్యాంకు, ఖాతాను ఫోను నంబర్‌కు అనుసంధానం చేసి యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు. జేబులో డబ్బులు లేకుండానే కేవలం ఫోను సాయంతో షాపింగ్‌లు చేసేస్తున్నారు. దాంతో నగరం దాదాపుగా డిజిటల్ హైదరాబాద్‌గా మారింది. వ్యాపారులు సైతం తమ వద్ద యూపీఐ చెల్లింపులు ఉన్నాయంటూ బోర్డులు పెడుతున్నారు. ప్రతి టీ దుకాణంలోనూ స్కానర్లు అందుబాటులో ఉన్నాయంటే సాంకేతికత ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ఆటో డ్రైవర్లు సైతం తమ ఫోన్ల ద్వారానే నగదు వసూలు చేసుకుంటున్నారు.
సాంకేతికత పెరిగే కొద్ది మోసాలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. పలువురు సైబర్ నేరగాళ్లు యూపీఐ చెల్లింపుల్లోనూ మోసాల బారిన పడుతున్నారు. స్కానర్ చేసి నగదు చెల్లించినట్లు చూపించి మోసం చేస్తున్నారు. నగదు వ్యాపారి ఖాతాలో జమ కావడం లేదు. ప్రత్యేక యాప్‌ల సాయంతో ఇలాంటి మోసాలకు తెర లేపుతున్నారు. ఇటీవల కాలంలో నగరంలోనూ ఇలాంటి మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ తరహా మోసాలను పసిగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గతంలో నగదు కావాలంటే ఏటీఎం కేంద్రాల వద్ద బారులు తీరేవారు. ఉద్యోగులు ప్రతినెల మొదటి వారంలో నగదు కోసం బ్యాంకులు, ఏటీఎం సెంటర్లకు వెళ్లేవారు. గంటల కొద్దీ క్యూలో నిలిచి నగదు డ్రా చేసేవారు. ప్రతినెల నగదు కోసం ఒక యుద్ధమే చేసేవారు. ప్రస్తుతం ఆ సమస్య తీరిపోయింది. ఇంటి అద్దె, రుణాలు, ఈఎంఐలు, సరుకులు, పెట్రోల్, స్కూలు ఫీజులు, కూరగాయలు సైతం యూపీఐ ద్వారా చెల్లింపులు జరుపుతుండటంతో ఏటీఎం కార్డుల వినియోగం తగ్గింది. కేవలం ఫోను సాయంతోనే ప్రతీదీ చెల్లించేస్తున్నారు. దాంతో నగదుతో ఆవసరం లేకుండా పోతుంది. దాదాపు 95 శాతం నగర ప్రజలు యూపీఐలకే అలవాటు పడ్డారు.
మాది కంటోన్మెంట్‌లోని సిఖ్ విలేజ్‌లో చిన్న టీ దుకాణం. స్కానర్లు లేవా అని చాలా మంది అడిగి వెళ్లేవారు. అది ఏర్పాటు చేశాక చాలా మంది ఫోన్‌తోనే నగదు చెల్లిస్తున్నారు. ప్రతీదీ యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు. ఇది చాలా బాగుంది. వ్యాపారం కూడా పెరిగి, లాభసాటిగా మారింది. దాంతో రోజుకు ఎంత వ్యాపారం జరిగిందనేది కూడా యాప్‌లోనే వస్తుండటంతో వేరేగా రాసుకోవాల్సిన అవసరం లేకుండా పోతుంది.
– ప్రవీణ్, టీ స్టాల్ యాజమాని, సిఖ్‌విలేజ్