మాదాపూర్, నవంబర్ 13: నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ అభివృద్ధి పథంలో తీసుకురావడంతోపాటు ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే గాంధీ ఆదేశాల మేరకు కాలనీలో నెలకొన్న అంతర్గత రహదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని జీహెచ్ఎంసీ అధికారులు శాశ్వత పరిష్కారాన్ని అందించేందుకు కృషి చేస్తున్నారు. హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలు ఇటీవలే వర్షాలకు గుంతలమయంగా మారడంతో ఆయా కాలనీ ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన రహదారులతో పాటు సుఖవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ప్రధాన, అంతర్గత రహదారులను అభివృద్ధి చేసేందుకు తగిన నిధులను కేటాయిస్తున్నది. ఈ నేపథ్యంలో హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని ప్రకాశ్‌నగర్ కాలనీలో రూ.42 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా కాలనీలోని రెండు అంతర్గత రహదారుల్లో కలిపి మొత్తం 320 మీటర్ల మేర అంతర్గత రహదారులను వేయగా అందులో ఒకచోట 180 మీటర్లు, మరో చోట 140 మీటర్ల మేర అంతర్గత రహదారులను పూర్తి చేయడం జరిగింది. అంతర్గత రహదారుల సమస్యలను పరిష్కరించడంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హఫీజ్‌పేట్‌లోని డివిజన్ పరిధిలోని ప్రకాశ్‌నగర్ కాలనీలో ఇటీవలే అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. నేటితో పనులు పూర్తి కావడంతో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇది వరకు ఉన్నటువంటి గతుకుల రోడ్లతో కాలనీ ప్రజలు అనేక ఇబ్బందులకు పడేవారు. దీంతో అభివృద్ధి పనులను త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుని నాణ్యత ప్రమాణాలతో సకాలంలో అందుబాటులోకి తీసుకువచ్చాం.
– ప్రతాప్, ఏఈ, హఫీజ్‌పేట్
హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని ప్రకాశ్‌నగర్ కాలనీలో అంతర్గత రహదారులు అస్తవ్యస్తంగా మారడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పలుమార్లు రహదారుల అభివృద్ధి పనులను పరిశీలించి పనులను నాణ్యతతో చేపట్టి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవడం జరిగింది. నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడకుండా మౌలిక వసతులు కల్పించడంలో రాజీపడకుండా.. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. స్థానికంగా తలెత్తిన సమస్యలను దృష్టికి తీసుకువచ్చినట్లయితే తక్షణమే వాటి పరిష్కారానికి కృషి చేస్తాను.
– అరెకపూడి గాంధీ, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్