కుత్బుల్లాపూర్, నవంబర్ 13 : ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆదివారం కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలో రూ.2.75 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. రూ.56.50 లక్షల వ్యయంతో దత్తాత్రేయనగర్‌లో సీసీరోడ్డు నిర్మాణ పనులు, పద్మానగర్ ఫేస్-1లో రూ.54 లక్షలతో చేపడుతున్న సీసీరోడ్డు నిర్మాణ పనులు, కల్పన సొసైటీలో రూ.26.60 లక్షలతో సీసీరోడ్డు పనులు, ద్వారకాపురి కాలనీలో రూ.26.40 లక్షలతో సీసీరోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.
అలాగే.. బాల్‌రెడ్డినగర్‌లో రూ.11 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, పురపాలక శాఖమంత్రి కేటీఆర్‌ల సహకారంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామ ని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీశ్, పార్టీ యూత్ వింగ్ నియోజకవర్గ అధ్యక్షుడు దూదిమెట్ల సోమేశ్ యాదవ్, పార్టీ డివిజన్ అధ్యక్షుడు దేవరకొండ శ్రీనివాస్, కార్యదర్శి సత్తిరెడ్డి, నాయకులు కిశోర్‌చారి, ముత్యాలు, వినోద్, ఆయా కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు, కాలనీ అసోసియేషన్ల ప్రతినిధులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను కలిశారు. ఐడీపీఎల్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 150 కుటుంబాలు ఆయనను కలిసి సమస్యలు పరిష్కరించాలని విన్నవించుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే.. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా తగు చర్యలు తీసుకుంటానని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. అనంతరం చింతల్ డివిజన్ హిందూ టెంపుల్ నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను కలిశారు. అధ్యక్షుడు వేముల జగన్నాథం, ప్రధాన కార్యదర్శి రమేశ్, కోశాధికారి దాసి, దయానంద్‌తో పాటు కమిటీ సభ్యులను ఆయన అభినందించారు.