సిటీబ్యూరో, ఏప్రిల్15, (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో అనుమతులకు విరుద్ధంగా మోటార్ వాడకం అరికట్టడానికి, నీటి వృథాను నివారించడానికి జలమండలి మంగళవారం ‘మోటార్ ఫ్రీ టాప్’ డ్రైవ్‌ను ప్రారంభించింది. మొదటి రోజే 64 మోటార్లను సీజ్ చేయగా.. 84 మంది వినియోగదారులకు అక్రమంగా మోటార్లు ఉపయోగించి, నీటి వృథా చేసినందుకు జరిమానా విధించారు.
అత్యధికంగా ఓ అండ్ ఎం డివిజన్ లో 6, ఎస్ఆర్ నగర్ పరిధిలో 25 మోటార్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి పైపులైన్ల ద్వారా మహానగరానికి తాగునీరు సరఫరా అవుతుంది. జలమండలి పర్యవేక్షణ లేమితో కొందరు వినియోగదారులు తమ నల్లాలకు అక్రమంగా మోటార్లు అమర్చి నీటిని తోడేస్తున్నారు.
దీని కారణంగా మిగతా సామాన్యులకు తక్కువ ప్రెషర్‌తో నీరు సరఫరా అవుతున్నది. ఆలస్యంగా గ్రహించిన జలమండలి వారిపై చర్యలకు పూనుకున్నది. వినియోగదారులు తమ నల్లాలకు మోటార్లు బిగించి పట్టుబడితే, నిబంధనల ప్రకారం.. జరిమానాతోపాటు మోటార్లు స్వాధీనం చేసుకుంటున్నారు. ఒకటికి రెండుసార్లు పట్టుబడితే కేసులు సైతం నమోదు చేయనున్నారు. నీటి సరఫరాలో ఎలాంటి సమస్యలెదురైనా జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.